Economic Survey 2025 : దేశవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయి, మధ్యతరగతికి ఏమైనా ఊరటలు కలుగుతాయేమో అని అనేక వర్గాలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది దేశ ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025 ఆర్థిక సర్వే పత్రాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
2024 జులైలో సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత 2024-25 ఏడాదికి ఆర్థిక సర్వేను ఆరు నెలల స్వల్ప కాలిక వ్యవధిలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు మరోమారు పూర్తి ఆర్థిక ఏడాదికి.. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వెలువడిన ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం, ప్రపంచ అస్థిరతలు కొనసాగుతున్న వేళ 2026లో దేశ జీడీపీ వృద్ధిరేటు ఆశాజనకంగానే ఉంటుందని తెలిపింది. వివిధ అంశాల్ని పరిగణలోకి తీసుకుని.. వచ్చే ఏడాది 6.3% – 6.8% మధ్య వృద్ధి రేటు నమోదు ఉంటుందని ఈ నివేదిక వెల్లడించింది.
సర్వే ప్రకారం అన్ని రంగాలు మంచి మన పనితీరు కనబరిచాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలియజేశారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని తెలిపిన మంత్రి.. పారిశ్రామిక రంగం కూడా మహమ్మారి కరోనా ముందు నాటి పరిస్థితి కంటే మెరుగ్గానే ఉందని వెల్లడించారు. ఇక ఆర్థిక అభివృద్ధి రేటులో సేవల రంగానికి ప్రత్యేక పాత్ర ఉంటుంది. అలాంటి సేవా రంగంలో బలమైన వృద్ధిరేటు కొనసాగుతుందని ఈ ఆర్థిక సర్వే అంచనా వేసింది.
వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు ద్రవ్య విధాన చర్యలు ఫలితంగా 2024 లో 5.4% నుంచి ఏప్రిల్డి-సెంబర్ 2025 నాటికి 4.9 శాతానికి ద్రవ్యోల్భణం తగ్గింది. సరఫరా గొలుసులో అంతరాయం, విపరీతమైన వాతావరణ పరిస్థితులు కారణంగా తగ్గిపోయిన పంటల ఉత్పత్తి.. భారత ఆహార ద్రవ్యోల్భణానికి ముఖ్య కారణాలుగా సర్వే అంచనా వేసింది. వాణిజ్య బ్యాంకులు నిరర్థక ఆస్తులు నిష్పత్తిలో స్థిరమైన క్షీణత కొనసాగిందని సర్వే హైలెట్ చేసింది.
సర్వే ప్రకారం భారత స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 2025లో తిరిగి పుంజుకుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024 మొదటి 8 నెలల్లో 47.2 బిలియన్ డాలర్లు నుంచి 2025 అదే కాలానికి 55.6 బిలియన్ డాలర్లకు ఈ పెట్టుబడులు పెరిగాయని ఆర్థిక సర్వే తెలిపింది. ఇది 17.9 శాతం వృద్దికి సమానమని సర్వే తెలిపింది. వచ్చే శతాబ్ద కాలంలో భారత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా.. మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని ఈ సర్వే స్పష్టం చేసింది.
ఆర్థిక సర్వే అంటే ఏమిటి?
ఆర్థిక సర్వే అనేది నిర్దిష్ట రంగాలపై.. నిర్దిష్ట దృష్టితో ఆర్థిక వ్యవస్థ వివరణాత్మక విశ్లేషణను అందించే పత్రం. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఇందులో మొదటి పార్టు.. ఆర్థిక పనితీరును అంచనా వేస్తుంది. దేశ ఆర్థిక విధానాలు, స్థూల ఆర్థిక సూచికలను ఇందులో హైలైట్ చేస్తుంది. రెండో పార్టులో.. జీడీపీ పెరుగుదల, ద్రవ్యోల్బణం, వాణిజ్యానికి సంబంధించిన అంచనాలతో పాటు విద్య, పేదరికం, వాతావరణ మార్పు వంటి సామాజిక-ఆర్థిక సమస్యలను విశ్లేషిస్తుంది.
Also Read : బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం.. పోలవరం కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు