Budget Session President Murmu | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. తన ప్రసంగం ప్రారంభంలో, ప్రయాగ్రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శ్రద్ధాంజలి అర్పించారు.
“మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభిస్తున్నాం. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం” అని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని ఆమె తెలిపారు. ఇక ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్రపతి ముర్ము ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని.. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12 వేల కోట్లు అదనంగా కేటాయించినట్లు వెల్లడించారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే…
మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే మూడు రెట్లు వేగంగా పనిచేస్తోంది. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ త్వరలో అవతరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
పేదరిక నిర్మూలన, సంక్షేమం
పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకువచ్చాం. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తున్నాం.
ఇళ్ల కల సాకారం
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు మూడు కోట్ల కుటుంబాలకు అదనంగా ఇళ్లు నిర్మించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పొడిగించాం.
ఆరోగ్య సంరక్షణ
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం.
రైలు మార్గాల్లో విప్లవాత్మక మార్పులు
అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను ప్రవేశపెట్టుతూ దేశ రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం.
విద్యా రంగంలో ప్రగతి
విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తున్నాం. నూతన విద్యా విధానం ద్వారా ఆధునిక విద్యా వ్యవస్థను నిర్మిస్తున్నాం.
సంస్కరణలు, కొత్త నిర్ణయాలు
సంస్కరణలను వేగవంతం చేస్తూ, ఒకే దేశం – ఒకే ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లు వంటి సాహసోపేత నిర్ణయాలను అమలు దిశగా తీసుకెళ్తున్నాం.
మహిళల సాధికారత
దేశంలోని కార్పొరేట్ సంస్థల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తూ దేశ గర్వించేలా చేస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం గొప్ప ముందడుగు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలను సాధికారత కల్పిస్తున్నాం. లక్ష్యం: 3 కోట్ల మంది మహిళలను లక్‌పతీ దీదీగా మార్చడం.
నూతన ఆవిష్కరణలు, పరిశోధన
భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా మార్చే లక్ష్యంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ప్రారంభించాం.
టెక్నాలజీ రంగంలో పురోగతి
కృత్రిమ మేధ (AI) రంగంలో భారత ఏఐ మిషన్‌ను ప్రారంభించాం. మన గగన్‌యాన్ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం త్వరలోనే అంగారక యాత్రకు ముందడుగుగా నిలవనుంది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ప్రయోగం చేసి ఇస్రో మరో విజయం సాధించింది.
వ్యాపార, ఎగుమతుల ప్రోత్సాహం
ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాలు, ఇ-కామర్స్ ఎగుమతి కేంద్రాలు లాంటి చర్యలతో అన్ని రంగాల్లో వ్యాపారాలను అభివృద్ధి పరుస్తున్నాం.
సైబర్ భద్రతపై దృష్టి
సైబర్ సెక్యూరిటీలో సమర్థత పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్‌ఫేక్‌లు వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాం.
భారత డిజిటల్ విజయాలు
భారత్ డిజిటల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషిస్తోంది. యూపీఐ లావాదేవీలు అభివృద్ధి చెందిన దేశాల ప్రశంసలు అందుకున్నాయి.
ఈ అభివృద్ధి వేగంగా కొనసాగిస్తూ భారత్‌ను అగ్రశ్రేణి దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం.
సమావేశాలకు ముందు మీడియాతో ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపుతుందని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, 2014 నుంచి పదేళ్ల కాలంలో పార్లమెంట్ సెషన్‌కు ముందు విదేశీ జోక్యం కనిపించలేదని కానీ ఈ సారి మాత్రమే కనిపిస్తోందని విపక్షాలకు చురకలు అంటించారు.
“పేదలు మరియు సామాన్య ప్రజలపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలి. భారతదేశం యొక్క శక్తి, సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయి. మూడోసారి ఎన్డీఎకు ప్రజలు అధికారాన్ని అప్పగించారు. మూడోసారి పార్లమెంట్‌లో సంపూర్ణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం. ఈ వార్షిక బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపుతుంది. భారతదేశ అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్‌లో ముందుకు సాగుతున్నాం. ఇన్నోవేషన్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. కొత్త విధానాలపై ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. పార్లమెంట్‌లో చరిత్రాత్మక బిల్లులను ప్రవేశపెడుతున్నాం. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని, ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నాను” అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారు. శనివారం కేంద్ర బడ్జెట్‌ను ఆమె సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలు రెండు ఫేజ్‌లుగా శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతాయి. మొదటి ఫేజ్ ఫిబ్రవరి 13వ తేదీ వరకు, రెండో ఫేజ్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.