Election-time seizures Data: భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బు, మాదక ద్రవ్యాలు, బంగారంకు సంబంధించిన తాజా గణాంకాలు, సమగ్ర డేటాను భారత ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రూ. 8889.74 కోట్లు విలువ గల డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలను సీజ్ చేశామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. 45 శాతంతో మాదక ద్రవ్యాలు మొదటి స్థానంలో నిలిచాయి. వీటి విలువ సుమారు రూ. 3958 కోట్లు ఉంటుందని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. మార్చి 1 తర్వాత ఎన్నికల కమిషన్ ఎక్కువ మొత్తంలో వీటిని స్వాధీనం చేసుకుందని పేర్కొంది.
నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రూ. 8889 కోట్లలో, నగదు స్వాధీనం కేవలం రూ. 849.15 కోట్లు అని, 5.39 కోట్ల లీటర్ల మద్యం పట్టుబడగా దాని విలువ దాదాపు రూ. 814 కోట్లు ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు 1260.33 కోట్ల విలువైన లోహాలు స్వాధీనం చేసుకోగా, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ. 2006.56 కోట్లు.
Also Read: తవుడు బస్తాల మధ్య 7 కోట్లు.. సినీ తరహాలో తరలింపు.. చివరికి..?
ఇందులో గుజరాత్‌లో దాదాపు రూ. 1461 కోట్లు స్వాధీనం చేసుకుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆ తరువాత స్థానంలో రూ. 1134 కోట్ల రూపాయలతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 75 ఏళ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. కాగా ఈ మొత్తం రూ. 9 వేల కోట్లు దాటనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.