Eligible Woman Alimony Court| భర్త నుంచి విడాకుల కోరే మహిళలు తమకు ఉన్నత విద్యార్హతలు, మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉన్నా.. తాత్కాలిక భరణం కోరడం సరికాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. చట్టం సోమరితనాన్ని ప్రోత్సహించదని జస్టిస్ చంద్రధారీ సింగ్ పేర్కొన్నారు. భర్తతో వివాదాల కారణంగా విడిగా ఉన్న భార్య తాత్కాలిక భరణం కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి ఈ తీర్పు ప్రకటించారు. నిరక్షరాస్యులైన మహిళల మాదిరిగా భర్తలపై ఆధారపడటం ఏ మాత్రం సమంజసం కాదని హై కోర్టు సూచించింది.
ప్రపంచ జ్ఞానం ఉన్న మహిళలు స్వతంత్రంగా, స్వయం శక్తి కోసం ప్రయత్నించాలని తెలిపారు. ఢిల్లీ హై కోర్టు విచారణ చేసిన విడాకులు, భరణం కేసులో.. మహిళకు 2019లో వివాహం జరిగింది. ఆ తర్వాత దంపతులు సింగపూర్‌కు వెళ్లారు. అక్కడ భర్త, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని భార్య ఆరోపిస్తూ.. 2021 ఫిబ్రవరిలో ఇండియాకు తిరిగి వచ్చేసింది. తనకు ఉద్యోగం లేదని, ఇతర ఆస్తులు లేవని, బంధువుల ఇంట్లో నివసిస్తున్నానని తెలిపి తాత్కాలిక భరణం కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే ఈ కేసులో భర్త తరపున లాయర్ వాదిస్తూ.. ఆమె వివాహానికి ముందు ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించి.. అధిక వేతనం ఉన్న ఉద్యోగం చేసిందని కోర్టుకు తెలిపారు. కేవలం నిరుద్యోగం ఆధారంగా తాత్కాలిక భరణం కోరడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన ట్రయల్ కోర్టు భార్య పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పును ఆమె ఢిల్లీహైకోర్టులో సవాలు చేసినప్పటికీ ఉపశమనం లభించలేదు.
Also Read: మా కూతురే అల్లుడిని చంపింది.. నేవి ఆఫీసర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు
భార్య అశ్లీల చిత్రాలు చూసినంత మాత్రాన విడాకులు కోరడం తప్పు : మదురై కోర్టు
మహిళలు లైంగికంగా స్వీయ సంతృప్తి (Masturbation) పొందడం భార్యాభర్తల విడాకులకు కారణం కాకూడదని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కరూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. అందులో, తనకు మరియు తన ప్రాంతంలోని ఒక యువతికి 2018లో వివాహం జరిగిందని, వారికి ఇంకా పిల్లలు లేరని చెప్పారు. 2020 నుండి వారు విడిగా జీవిస్తున్నారని తెలిపారు. తనను కలపాలని కరూర్ కోర్టులో తన భార్య పిటిషన్ దాఖలు చేసిందని, అయితే తాను విడాకులు కోరుతూ మరో కేసు దాఖలు చేశానని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం భార్య కోరికను ఆమోదించి తన కేసును తిరస్కరించిందని ఆయన తెలిపారు. తన కేసును విచారణకు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.
ఈ కేసును న్యాయమూర్తులు జస్టిస్ స్వామినాథన్ మరియు జస్టిస్ పూర్ణిమ విచారించి తీర్పు ఇచ్చారు. అందులో, పిటిషనరు మరియు అతని భార్యకు ఇద్దరికీ రెండవ వివాహమేనని, వారి మొదటి వివాహాలు చట్టప్రకారం రద్దయ్యాయని, వివాహం తర్వాత రెండు సంవత్సరాలు కలిసి జీవించారని, ఆ తర్వాత పిటిషనర్ తన భార్యపై అనేక ఆరోపణలు చేశారని తెలిపారు. ఆమెకు లైంగిక వ్యాధి ఉందని, ఇంట్లో ఏ పనీ చేయడం లేదని, లైంగికంగా స్వీయ సంతృప్తి పొందే అలవాటు ఉందని, ఏకాంతంలో అశ్లీల చిత్రాలు చూస్తుందని పిటిషనరు ఆరోపించినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె ఈ ఆరోపణలు నిజం కాదని, లైంగిక వ్యాధి ఉన్న మహిళతో కలిసి జీవించడం వలన తాను కూడా ఆ వ్యాధికి గురైనానని ఆరోపించినదానికి పిటిషనర్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. పిటిషనరు భార్య ఏకాంతంలో అశ్లీల చిత్రాలు చూడటాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని, వివాహం తర్వాత ఒక స్త్రీ తన భర్త కాకుండా వేరే వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది విడాకులకు కారణంగా పరిగణించబడుతుందని తెలిపారు. లైంగిక స్వీయ సంతృప్తి పొందడం విడాకులకు కారణం కాదని, దాన్ని భర్తను వేధించినట్లు పరిగణించలేమని కోర్టు తెలిపింది. ఈ కేసులో పిటిషనరు చేసిన ఆరోపణలేవీ నిరూపితం కాకపోవడంతో దిగువ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తున్నామని తీర్పు ఇచ్చారు.