Fake Doctor Ex Chhattisgarh Speaker| మధ్యప్రదేశ్ లో నకిలీ వైద్యుడి (Fake doctor) చేతిలో ఒకే నెలలో ఏడుగురు పేషెంట్లు చనిపోయిన వార్త కలకలం రేపింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో మరొక ఆందోళనకర విషయం బయటపడింది. ఆ నకిలీ డాక్టర్ బాధితుల్లో ఏకంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కూడా ఉన్నాడని తెలిసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ శుక్లా మరణానికి ఈ నకిలీ వైద్యుడే కారణమని తాజా సమాచారం.
ఛత్తీస్‌గఢ్‌లో బిలాస్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అప్పటి అసెంబ్లీ స్పీకర్ శుక్లా.. గుండె శస్త్రచికిత్స (Cardiac surgery) చేయించుకున్నారు. చికిత్స సమయంలోనే ఆయన మరణించారు. ఆ సమయంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ పేరు నరేంద్ర జాన్ కెమ్ అనే యూకే (UK) వైద్యుడు. ఈ వ్యక్తి యూకే నుంచి రిటైర్డ్ అయ్యారని తెలియజేశారు. ఈ సంఘటనపై శుక్లా కుమారుడు మీడియాతో మాట్లాడుతూ.. “మా నాన్నకు చికిత్స జరుగుతున్నప్పుడు నేను ఆసుపత్రిలోనే ఉన్నాను. ఆ వైద్యం తీరుపై నాకు అనుమానం వచ్చేది. అతను నకిలీ వైద్యుడు అని మాకు తరువాత ఇతరుల ద్వారా తెలుసింది. కానీ ప్రైవేట్ ఆసుపత్రి అతడిని గొప్ప డాక్టర్ అని చెప్పింది. ఈ సంఘటనపై ప్రభుత్వం సుమోటోగా (స్వయంగా) విచారణ చేయాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది” అని డిమాండ్ చేశారు.
బిలాస్‌పూర్ సీఎంహెచ్‌ఓ (Chief Medical and Health Officer) డాక్టర్ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. “ఈ విషయంపై దర్యాప్తు బృందాన్ని పంపాం. అతను సరైన రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యవృత్తిలో కొనసాగుతుంటే అది చాలా తీవ్రమైన విషయం” అని తెలిపారు.
Also Read: గుండె ఆపరేషన్లు చేసిన నకిలీ డాక్టర్.. ఏడుగురు మృతి
నరేంద్ర జాన్ కెమ్ అనే పేరుతో గుండె వైద్య నిపుణుడు మధ్య ప్రదేశ్ రాష్ట్రం దమోహ్ పట్టణంలోని ప్రైవేట్ మిషనరీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నాడు. అతని శస్త్రచికిత్సల తర్వాత వారం లోపల ఏడుగురు రోగులు మరణించారని ఫిర్యాదులు వచ్చాక అధికారులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తులో నిందితుడు అసలు వైద్యుడే కాదని గుర్తించారు. అతను బ్రిటన్‌లోని ప్రసిద్ధ వైద్యుడి పేరు ఉపయోగించి కార్డియాలజిస్టుగా చెలామణి అవుతున్నాడని తెలియజేశారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో మాట్లాడుతూ.. నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తెలిపారు. అతను చేసిన ఆపరేషన్లకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి నిధులు కూడా పొందుతున్నాడని చెప్పారు. నిందితుడు బ్రిటన్‌లోని ప్రసిద్ధ వైద్యుడి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి వైద్యుడిగా కొనసాగుతున్నాడని తెలియజేశారు. హైదరాబాద్‌లో కూడా అతనిపై పలు కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.
మృతుల సంఖ్య ఏడుగురు అని బాధితులు చెప్పినా, ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడు విక్రమ్ యాదవ్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎంబిబిఎస్ డిగ్రీ సరిఫికెట్లు పొందినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత కోల్ కతా, డార్జీలింగ్ వైద్యా కాలేజీల నుంచి నకిలీ ఎండి డిగ్రీ సర్టిఫికేట్లు కూడా పొందాడని విచారణలో వెల్లడైంది. మధ్య ప్రదేశ్ మిషనరీ ఆస్పత్రిలో మొత్తం 15 ఆపరేషన్లు చేయగా ఏడుగురు చనిపోయారు.