Fake Doctor Cardiologist Madhya Pradesh| ఓ నకిలీ డాక్టర్ అనేకమంది రోగుల జీవితాలతో చెలగాటం ఆడాడు. వరుసగా గుండె శస్త్రచికిత్సలు చేసి వారిని ప్రాణాల నుంచి కొల్లగొట్టాడు. కేవలం నెలరోజుల వ్యవధిలో ఏడుగురిపై గుండె ఆపరేషన్లు చేసి వారి మరణానికి కారణమయ్యాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో “ఎన్ జాన్ కెమ్” అనే వ్యక్తి క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నట్లు ప్రదర్శించాడు. అసలు విషయమేమిటంటే, అతడు అదే పేరుతో ప్రఖ్యాత బ్రిటిష్ డాక్టర్‌గా నటిస్తూ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నాడు. ఈ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేసేవాడు. అయితే అతడు ఆపరేషన్ల చేసిన తర్వాత రోగులు వరుసగా చనిపోతుండటంతో ఆస్పత్రిలో కలకలం రేగింది. అతడి వద్ద గుండె ఆపరేషన్ చేసిన వారిలో కేవలం నెలరోజుల్లో ఏడుగురు మరణించారు. దీంతో ఆ డాక్టర్ నైపుణ్యంపై అనుమానాలు కలిగాయి.
Also Read: జమిలి ఎన్నికలు అప్పుడే.. సమయం చెప్పేసిన నిర్మలా సీతారామన్
ఈ పరిణామాల్లో భాగంగా న్యాయవాది మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దీపక్ తివారీ.. నకిలీ డాక్టర్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ తర్వాత మరణించిన రోగుల సంఖ్య అధికారికంగా 7గా నమోదైనప్పటికీ.. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తేలింది. విక్రమాదిత్య ఒక బ్రిటీష్ డాక్టర్ పేరు పెట్టుకొని నకిలీ సరిఫికెట్లతో ఆస్పత్రిలో భారీ పారితోషకం తీసుకునే ఉద్యోగం పొందాడు. చిన్న చితకా వైద్యుడైతే బయటికి తెలియకపోయేది. కానీ ఏకంగా గుండె వైద్య నిపుణుడు అని చెప్పుకోవడంతో ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. తనకు తెలియని వైద్యాన్ని చేయడానికి సాహిసించన నిందితుడు రోగుల ప్రాణాలు తీశాడు.
ఈ కేసులో న్యాయవాది దీపక్ తివారీ మాట్లాడుతూ.. అధికారికంగా ఏడుగురు మరణించినట్లు నమోదైనప్పటికీ, మరణాల అసలు సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. నకిలీ డాక్టర్ బండారం బయటపడడంతో.. అప్పటికే ఆపరేషన్‌కు సిద్ధమైన చాలామంది రోగులు భయంతో వేరే ఆసుపత్రులకు వెళ్లిపోయినట్లు తెలిపారు. అంతేకాదు, నిందితుడు నరేంద్ర యాదవ్‌పై హైదరాబాద్‌లో కూడా ఓ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.