Maoists: ఆపరేషన్ కగార్.. మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన ఈ ఆపరేషన్ ఇప్పుడు తన లక్ష్యానికి చేరువవుతున్నట్టే కనిపిస్తోంది. గతంలోలాగా మావోయిస్టులను ఏరివేయడమే కాదు.. వారిని నడిపించే సెంట్రల్ కమిటీ సభ్యులపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి భద్రతా బలగాలు. ఇందులోనా ముఖ్యంగా తెలుగువారిపైనే స్పెషల్ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.
తెలుగు వారే ఎక్కువ..
నంబాల కేశవరావు, సుధాకర్, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, చలపతి, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ.. ఇప్పుడు మనం చెప్పిన పేర్లు సామాన్యమైనవి కాదు. వీరంతా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు. వీరే మావోయిస్టులను ముందుండి నడిపించేవారు. కానీ వీరంతా ఇప్పుడు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. మరోవైపు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలైన పోతుల పద్మావతి లెటెస్ట్‌గా లొంగిపోయారు. వీరంతా కూడా తెలుగువారే. వీరు మాత్రమే కాదు.. మరో 74 మంది తెలుగు వారు మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనేక డివిజన్లు, కమిటీలు, సెంట్రల్ కమిటీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు భద్రతా బలగాలు వీరిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.
15 మందిలో పది మంది తెలుగోళ్లే..
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుల్లో 15 మంది ఉంటే.. అందులో తెలుగువారు 10 మంది. ఇందులో ఇప్పటికే ఏడుగురిని మట్టుబెట్టారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా తిరుపతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నంబాల కేశవరావు మృతితో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కానీ గతంలోలాగా అంత మెరుగైన పరిస్థితులు కనిపించడం లేదు. ఓ వైపు చొచ్చుకొస్తున్న భద్రతా బలగాలు.. మరోవైపు అంతర్గత కుమ్ములాటలు మావోయిస్టులను ఇబ్బందులు పెడుతున్నాయి.
మావోయిస్టులో చీలిక
మావోయిస్టులో చీలిక వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆయుధాలు వదిలేయాలని కొందరు.. కాదు కొనసాగించాలని మరికొందరు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా వేణుగోపాల్ వ్యవహారమే దీనికి ఉదాహరణ. సెంట్రల్ కమిటీలో ఉన్న వేణుగోపాల్ కూడా ఉద్యమాన్ని వీడాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే అభయ్ పేరుతో లేఖలు విడుదలయ్యాయి. ఆయుధాలను వదిలేస్తున్నట్టు ప్రకటించారు. కానీ సెంట్రల్ కమిటీ దీనిని ఖండించింది. వెంటనే ఆయుధాలను అప్పగించాలని ఆదేశించింది. అంటే వేణుగోపాల్, తిరుపతి మధ్య పరిస్థితులు అంత బాగా లేవని అర్థమవుతోంది.
ALSO READ: National Awards: 71వ నేషనల్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. ‘బలగం’, ‘హనుమాన్’ చిత్రాలకు జాతీయ అవార్డు..
మరో ఆప్షన్ లేదు..
దండకారణ్యాన్ని ఓ కంచుకోటగా మార్చుకొని భద్రతా బలగాలను ముప్పు తిప్పలు పెట్టిన మావోయిస్టులు ఇప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది అర్థమవుతోంది. దీనికి కారణం భద్రతా బలగాల వ్యూహం మారడమే. అధినాయకత్వాన్ని టార్గెట్ చేయడమే. మరి భద్రతా బలగాల వేట ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటన్నది చూడాలి. మావోయిస్టులతో చర్చలు జరిపే ఉద్దేశం ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఆయుధాలు వదిలి వచ్చి లొంగిపోవడం తప్ప వారికి మరే ఆప్షన్ లేదని తేల్చి చెబుతున్నారు.
ALSO READ: Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఎలా పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?