రాత్రి పూట ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిద్రపోవాలంటే ఏం చేయాలనే విషయంలో నిపుణులు చాలా సూచనలు చేస్తుంటారు. పడుకునే విధానం అనేది ఆరోగ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందంటారు. అయితే, నిద్రపోయే సమయంలో ఎలా పడుకోవాలి? ఎడమవైపు పడుకుంటే మంచిదా? కుడివైపు పడుకుంటే మంచిదా? గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా పడుకోవాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సౌకర్యవంతంగా పడుకుంటే చక్కటి నిద్ర లభిస్తుంది. కానీ, కొంత మంది కుడివైపు పడుకుంటే గుండెకు మంచిదికాదని భావిస్తుంటారు. అయితే, డాక్టర్లు ఈ విషయం గురించి ఏం చెప్తున్నారంటే.. గుండె సమస్యలు ఉన్నవాళ్లు పడుకునే విధానంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. “ఆరోగ్యకరమైన వ్యక్తులు కుడి వైపు పడుకోవడం అస్సలు హానికరం కాదు. అయితే, మీరు కొన్నిసార్లు ఊపిరి ఆడకపోతే, దడ కలిగినట్లు అయితే, పడుకునే విధానాన్ని మార్చడం మంచిది” అంటారు థానేకు చెందిన కార్డియాక్ నిపుణుడు డాక్టర్ కల్మత్.
కుడి వైపున పడుకున్నప్పుడు గుండె ఛాతీలో కొంచెం ఎత్తులో ఉంటుంది. గుండెపై తక్కువ ఒత్తిడి ఉన్నట్లు అనిపించేలా చేస్తుంది. శ్వాసను సులభతరం చేస్తుంది. అందుకే, గుండె సంబంధిత అసౌకర్యంతో బాధపడుతున్న వ్యక్తులు కుడి వైపు పడుకుంటే ప్రశాంతంగా ఉన్నట్లు భావిస్తారని డాక్టర్ కల్మత్ వెల్లడించారు. “ఆరోగ్యకరమైన వ్యక్తులకు, ఇరువైపులా పడుకోవడం మంచిది. చాలా మందికి కుడి వైపున నిద్రపోవడం గుండెకు హానికరం కాదు. నిజానికి, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వారికి కుడి వైపున నిద్రపోవడం మరింత సౌకర్యవంతంగా అనిపిస్తుంది” అని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వెల్లడించారు. గుండె ఛాతీ గోడకు దగ్గరగా ఉన్నందున ఎడమ వైపు పడుకున్నా కొన్నిసార్లు ఏం కాదు. కానీ, కొంతమంది రాత్రిపూట ఆందోళనకు, దడలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతారు. అలాంటి వాళ్లు కుడివైపు పడుకోవడం మంచిదని డాక్టర్ కల్మత్ వెల్లడించారు.
Read Also: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు
సాధారణంగా ఇలా పడుకోవాలనే విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. ఛాతీ మీద ఏది తేలికగా అనిపిస్తుందో చూడాలి. కుడివైపు పడుకుంటే బాగుంటుందా? ఎడవవైపు పడుకుంటే బాగుంటుందా? అనేది గమనించండి. ఏ వైపు పడుకుంటే ప్రశాంతంగా, ఇబ్బంది లేకుండా ఉంటుందో? ఆ వైపు పడుకోవడం మంచింది. మీరు సౌకర్యవంతంగా ఉన్న వైపు పడుకునేందుకు అవసరం అయితే దిండ్లు కూడా వేసుకోవడం మంచిది. సహజంగా, విశ్రాంతిగా అనిపించే స్థితిలో నిద్రపోవడంపై దృష్టి పెట్టడం మంచిది. ఇది గుండె, మనస్సు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎలాంటి మానసిక, శారీరక సమస్యలు రాకుండా చేస్తుంది.
Read Also: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!