Fengal Cyclone : తమిళనాడు రాష్ట్రాన్ని ఫెంగల్ తుఫాను హడలెత్తిస్తుంది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పెను తుఫానుగా మారి పుదుచ్చేరి తీరాన్ని తాకటంతో తుపాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర వరద ప్రభావంతో చెన్నైలోని పలు కాలనీలు, ఇల్లు జలదిగ్బంధమైపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు సర్వీసులు రోడ్లు, రైళ్లు సర్వీసులు నిలిచిపోగా.. చెన్నై విమానాశ్రయాన్ని సైతం మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఫెంగల్ తుఫాను తమిళనాడును ముంచెత్తుతుంది. గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో పలు చోట్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ప్రభావంతో కడలూరు, విల్లుపురం, పుదుచ్చేరి, కాంచీపురం, చైన్నెలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. పుదుచ్చేరితో పాటు తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు.
పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలుకు వెళ్లే రైళ్లు రద్దు చేస్తున్నామని.. కొన్ని ప్రాంతాలకే పరిమితంగా రైళ్లు నడుస్తాయని దక్షిణ రైల్వే వెల్లడించింది. ఇక తుపాను ప్రభావంతో విమాన సేవలకు సైతం అంతరాయం ఏర్పడింది. చెన్నై విమానాశ్రయాన్ని రాత్రి ఏడు గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమాన కార్యకలాపాలను సైతం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో వెల్లడించింది.