Anti Sikh Riots Sajjan Kumar | ఓ వ్యక్తి 40 ఏళ్ల క్రితం దారుణంగా హత్యలు చేశాడు. ఆ తరువాత ఓ రాజకీయ పార్టీ తరపున ఎంపీగా కూడా ఎన్నికయ్యాడు. అయితే అతనిపై హత్యల కేసు విచారణ అలా సాగుతూనే ఉంది. బాధితుల కుటుంబ సభ్యులు సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. ఇదంతా దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్య తరువాత దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మారణహోమానికి సంబంధించిన కేసులో ఒక దాని గురించి సంక్షిప్తం.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను కోర్టు తాజాగా దోషిగా ప్రకటించింది. ఈ కేసు విచారణ బుధవారం ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టులో జరిగింది. ఇరు వైపులా వాదన పూర్తి కావడంతో స్పెషల్ జడ్జి కావేరీ భవేజా.. నిందితుడు సజ్జన్ కుమార్‌ను ఈ కేసులో దోషిగా ప్రకటించారు. అయితే.. దోషికి శిక్ష గురించిన తీర్పు ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేశారు.
1984 నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హత్య చేసిన కేసులో సజ్జన్ కుమార్‌కు ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తర్వాత ఈ కేసును ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తు చేసింది. 2021 డిసెంబర్ 16న సజ్జన్ కుమార్‌పై కోర్టులో అభియోగాలు నమోదు చేసింది.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కులను లక్ష్యంగా చేసుకుని రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు, దోపిడీలు, గృహదహనాలు జరిగాయి. ఈ సంఘటనలో సరస్వతి విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను ఓ అల్లరిమూక హత్య చేసింది. కోర్టు ఈ రోజు జారీ చేసిన తీర్పులో సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్గొనడమే కాకుండా, ఆ అల్లరిమూక గుంపునకు నాయకత్వం వహించాడని తేల్చింది. ఇందుకు తగిన సాక్ష్యాలు కూడా లభించాయని కోర్టు తెలిపింది.
Also Read: రెండు రోజులు వెళ్లొద్దు.. కుంభమేళాలో 350 కి.మీ ట్రాఫిక్ జామ్
ఈ తీర్పును ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) ప్రధాన కార్యదర్శి జగ్దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌కు ఇంతకు ముందు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 ఢిల్లీ కంటోన్మెంట్ సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ.. 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఆ శిక్ష అనుభవిస్తున్నారు.
సజ్జన్ కుమార్ ఢిల్లీలో ఒక బేకరీ యజమానిగా ఉన్నారు. ఆయనకు ఇందిరా గాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన సజ్జన్ కుమార్ క్రమంగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి ఎన్నికయ్యారు.
1984 సంవత్సరంలో సిక్కులు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన తరువాత సజ్జన్ కుమార్ సిక్కుల వ్యతిరేకిగా పేరుతెచ్చుకున్నారు. క్రమంగా పార్టీలో ఓ ప్రముఖ నాయకుడిగా గుర్తింపుపొందారు. ఆ తరువాత 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543) పొందిన నేతగా రికార్డు సృష్టించారు. కానీ.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా ప్రకటించబడిన తర్వాత, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.