79వ స్వాతంత్ర దినోత్సవాన్ని నేడు భారతావని మొత్తం ఘనంగా జరుపుకుంది. ఊరూవాడా జెండా వందనం జరిగింది. నాయకులు, అధికారులు, సామాన్యులు.. జెండా పండుగలో పాల్గొన్నారు, తమ దేశభక్తిని చాటుకున్నారు. అయితే ఈరోజు జరిగిన అన్ని కార్యక్రమాల్లోకీ ఒకటి హైలైట్ గా నిలిచింది. ఆ కార్యక్రమం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఆ వీడియోని షేర్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సెల్యూట్ అంటున్నారు.
I don't know why but this video gave me goosebumps.
The rain, the salute everything perfect.
Jai Hind 🫡🇮🇳. pic.twitter.com/OVMIFZUU2Z
— Gems_of_Bharat (@Gemsof_Bharat) August 15, 2025
స్వాతంత్ర దినోత్సవ వేళ ఢిల్లీలో కుండపోత వర్షం. ఆ వర్షంలోనే ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కార్యక్రమం జరిగింది. అమరవీరులకు నివాళి అర్పిస్తూ, స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచే కార్యక్రమం అది. ముందు అనుకున్న షెడ్యూల్ కి అందరూ ఆ ప్రాంతానికి వచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అమర్ ప్రీత్ సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి.. సహా గౌరవ వందనం సమర్పించేందుకు త్రివిధ దళాల సైనికులు అక్కడకు చేరుకున్నారు. అంతలో భారీ వర్షం మొదలైంది. కానీ కార్యక్రమం మాత్రం ఆగలేదు.
జోరు వర్షంలోనే అమరవీరుల స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత సైనికులు నివాళులర్పిస్తూ బ్యాండ్ వినిపిస్తున్న వేళ, గౌరవ సూచకంగా అందరూ సెల్యూట్ చేశారు. ఎవరూ జోరువానను లెక్క చేయలేదు. త్రివిధ దళాల అధిపతులకు, సైనికులకు కనీసం తలపై టోపీలు అయినా ఉన్నాయి, కానీ రాష్ట్రపతి మాత్రం వానలో అలా తడుస్తూనే నిలబడ్డారు. తెల్లటి చీర ధరించిన ఆమె జోరు వాన, చలిగాలికి వెరవకుండా అక్కడే నిలబడి ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశానికే ప్రథమ పౌరురాలు అయిన ఆమె కనీసం గొడుగు నీడ కూడా లేకుండా, నివాళి కార్యక్రమంలో జోరు వానలో తడవటం చూస్తుంటే తమకు గూస్ బంప్స్ వస్తున్నాయని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ వీడియోను చాలామంది షేర్ చేస్తూ తమ సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తి కలిగిన ఇలాంటి నాయకుల గురించి ఎంత పొగిడినా తక్కువేనంటున్నారు. ఐరన్ లేడీ అని రాష్ట్రపతికి కితాబిస్తున్నారు నెటిజన్లు. దేశంపై ఉన్న గౌరవం, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలకు ఆమె ఇచ్చే గౌరవం ఇదేనని అంటున్నారు. ద్రౌపది ముర్ముకి సెల్యూ అంటున్నారు నెటిజన్లు.
చోటామోటా నాయకులు సైతం దర్పం చూపిస్తున్న రోజులివి. పక్కన మందీ మార్బలం, ఎండ వచ్చినా, వాన వచ్చినా గొడుగు పట్టేందుకు మనుషులు వారికి ఉండాల్సిందే. ఇలాంటి జోరు వానలో నాయకులెవరైనా ఇంత గౌరవంగా నిలబడటం ఎక్కడా చూడలేదని అంటున్నారు నెటిజన్లు. ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన పనికి, ఆమె పట్ల తమకు ఎంతో గౌరవం పెరిగిందని చెబుతున్నారు.