YS Sharmila On Jagan : అదానీ సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో గత వైఎస్ జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ.. అమెరికా విచారణ సంస్థలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ విషయమై ఆయన చెల్లి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ స్పందించారు. ఆమెరికాకు చెందిన విచారణ సంస్థ తన నివేదికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి కార్యనిర్వహక వ్యక్తికి.. అదానీ గ్రూప్ భారీగా ముడుపులు అప్పగించినట్లు ఆరోపించింది. ఆ వ్యక్తి కచ్చితంగా జగనే అంటూ షర్మిళ ఆరోపించారు. జగన్ కు చిత్తశుద్ది ఉంటే… అదానీ వల్ల తనకు ఎలాంటి ఆర్థిక లబ్ది చేకూరలేదని ఆయన అనుసరించే బైబిల్ మీది ప్రమాణం చేయగలరా అంటూ సవాలు విసిరారు. అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని కలిగించే ఇలాంటి అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక మౌనం పాటిస్తుందని షర్మిళ మండిపడ్డారు. అందుకే.. ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ షర్మిళ.. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Mr. Abdul Nazir)ను కలిశారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని పూర్తిగా సమీక్షించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరిన షర్మిళ.. ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన వారికి ప్రజల ముందుంచాలని కోరారు. అలాగే.. అతిపెద్ద కుంభకోణంగా చెబుతున్న ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని లేదా టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశాయని ఏపీ గవర్నర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.
అదానీ గ్రూప్ తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రశ్నించిన షర్మిళ.. యూనిట్ ధరల వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే… జగన్ హయాంలో రూ. 2.49 పైసలకు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. రేటు పెంచినందుకు శాలువాలు కప్పాలా అని షర్మిల ప్రశ్నించారు. అదానీ సోలార్ విద్యుత్ సంస్థల నుంచి గుజరాత్ ప్రభుత్వం యూనిట్‌ను రూ.1.99 పైసలకే ఒక్క యూనిట్ కొనుగోలు చేస్తే.. ఏపీ ఎందుకు అధిక ధరకు కొనుగోలు చేసిందని ప్రశ్నించారు.
అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అంటూ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే ..గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి కూడా ఒక రూ. 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదని షర్మిల ప్రశ్నించారు. నాడు రూ.2.49 పైసల రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారంటూ ప్రశ్నించారు.
Also Read : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇదొక్కటి మిస్ అయితే.. పథకాలన్నీ కట్..
ఒక ముఖ్యమంత్రిని వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా అని షర్మిల ప్రశ్నించారు. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి ఎందుకు రహస్యంగా అదానీని కలిశారో సమాధానం చెప్పాలంటూ సవాళు విసిరారు. అదానీ కలవడం ఒక చరిత్ర అన్న షర్మిళ.. నేరుగా ఓ ముఖ్యమంత్రికి రూ.1,750 కోట్లు ముడుపులు ఇవ్వడం రికార్డుగా అభివర్ణించారు.