India Vs Pakistan : ఒకరు ఇద్దరు కాదు. ఇప్పటి వరకు 11 మంది. ఇంకా దొరకని ఇంటిదొంగలు ఎంతమంది ఉన్నారో. వాళ్లకేం పోయే కాలమో కానీ.. కాసుల కక్కుర్తి కోసం దేశానికే ద్రోహం చేస్తున్నారు చెత్త వెధవలు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అయితే మరీ ఘోరం. ఏకంగా పాక్ ఏజెంట్‌తోనే సంబంధాలు పెట్టుకుంది. నిత్యం కాంటాక్ట్‌లో ఉంది. పాక్‌లో పర్యటించింది. దాయాది దేశంపై ఎక్కడలేని ప్రేమ చూపించింది. మన ఆర్మీ సీక్రెట్స్ పాకిస్తాన్‌కు అమ్మేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటోంది. జ్యోతి లాంటి వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు దేశద్రోహులు. లేటెస్ట్‌గా సహదేవ్ గోహిల్ అనే ద్రోహి దొరికిపోయాడు. గుజరాత్‌లోని కచ్‌లో ఉండే ఆ హెల్త్ వర్కర్.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నాడని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
సహదేవ్‌కు హనీట్రాప్
సహదేవ్ గోహిల్‌కు అదితి భరద్వాజ్ పేరుతో ఒక యువతి ఫోన్‌లో పరిచయమైంది. మెల్లగా మాటలు మొదలుపెట్టింది. క్రమంగా ముగ్గులోకి దింపింది. సహదేవ్ ఆ హనీ ట్రాప్‌కు ఈజీగా చిక్కుకున్నాడు. తనను పూర్తిగా నమ్మాడని కన్ఫామ్ చేసుకున్నాక.. ఇక అసలు పని ప్రారంభించింది ఆ యువతి. సరిహద్దుల్లో BSF, IAF మూవ్‌మెంట్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంది. ఆ మేటర్ అంతా పాకిస్తాన్‌కు చేరవేసింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ అదితి భరద్వాజ్ అసలు ఇండియనే కాదు. ఆమె పాకిస్తానీ. అది ఆమె అసలు పేరు కూడా కాదు. అదంతా హనీ ట్రాప్.
రూ.40 వేల కోసం..
పక్కా సమాచారంతో సహదేవ్‌ను అరెస్ట్ చేశారు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి అతనికి రూ.40 వేలు అందాయని తేలింది. తదుపరి విచారణ కోసం అతడిని అహ్మదాబాద్‌కు తరలించారు.
11 మంది అరెస్ట్.. ఇంకెంత మంది?
ఎంత దారుణం? ఓ యువతి కోసం ఆర్మీ రహస్యాలు అందించడం ఎంత ఘోరం? కేవలం రూ.40 వేల కోసం దేశ రక్షణనే పణంగా పెట్టాడంటే.. వాడెంత పనికిమాలినోడో తెలుస్తోంది. ఇలాంటి డబ్బుకు కక్కుర్తి పడే బ్యాచ్ ఉండబట్టే.. పాక్ ఆటలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు పాక్ ఐఎస్‌ఐ కోసం పని చేస్తున్న 11 మందిని అరెస్ట్ చేశారు. ఆయా రాష్ట్రాల పోలీసులతో పాటు.. ఇంటెలిజెన్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా వారిని విచారిస్తున్నారు. ఇంకా పోలీసులకు చిక్కని దేశద్రోహులు ఎంత మంది ఉన్నారో..