NEW CEC Gyanesh Kumar: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో త్రిసభ్య ఎంపిక కమిటీ ఆయన పేరును ఖరారు చేసింది. ఎంపిక చేసి కొత్త సీఈసీ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేశారు. ఆ తర్వాత ఆమె ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రస్తుతం సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్ పదవీకాలం ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం సాయంత్రం భేటీ అయ్యింది. ఈ ప్యానెల్ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నాయి. తీర్పు వచ్చేవరకు ఎంపిక భేటీని వాయిదా వేయాలంటూ రాహుల్ గాంధీ కోరారు. ఆయన మాటను తోసిపుచ్చి తదుపరి సీఈసీని కమిటీ ఎంపిక చేసింది ప్రధాని నేతృత్వంలోని కమిటీ. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసింది. కొత్త సీఈసీగా మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు జ్ఞానేష్‌కుమార్.
అర్థరాత్రి ప్రకటనపై కాంగ్రెస్ మండిపాటు
కొత్త ఎన్నికల కమిషనర్ నియామకంపై అర్థరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కలిగి ఉండాలంటే, సీఈసీ నిష్పాక్షికమైన పాత్ర పోషించే విధంగా ఉండాలన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ప్రస్తావించిందని గుర్తు చేశారు.
ALSO READ: ఢిల్లీ పీఠం దక్కేది ఎవరికి? రేసులో ఉన్నది వీరే!
కొత్త సీఈసీని ఎన్నుకునే ముందు ప్రభుత్వం ఫిబ్రవరి 19 వరకు ఉండాల్సిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఆగకుండా హడావుడిగా సమావేశాన్ని నిర్వహించడాన్ని తప్పుబట్టింది. న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడకముందే అపాయింట్‌మెంట్‌ను ఇవ్వడాన్ని తూర్పారబట్టింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించినట్లుగా రాజ్యాంగానికి లోబడి సమస్యను సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టకుండా నిర్ణయం తీసుకోవడంపై మండిపడింది.
జ్ఞానేష్‌కుమార్ ఎవరు, ఎక్కడ?
కొత్త సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్న జ్ఞానేష్ కుమార్ కేరళకు చెందినవారు. ఆయన వయసు 61 ఏళ్లు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం. గతేడాది మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియమితులయ్యారు. 1988వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2019లో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లు ముసాయిదా రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించారాయన.
హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు జ్ఞానేశ్వర్ కుమార్. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రక్షణ మంత్రిత్వ శాఖలో పని చేశారు. కాన్పూర్ ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ ఫైనాన్స్ చదివారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పలు కోర్సులు చేశారు.
రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్‌లో ఇద్దరు కమిషనర్లు ఉన్నారు. వారిలో జ్ఞానేష్ కుమార్ సీనియర్. అందుకే ఆయన ఎంపికకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2029 జనవరి నాలుగో వారం వరకు ఆయన ఈ పదవిలో కొనసాగతారు. 2027లో జరగనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు 2029 సార్వత్రిక ఎన్నికల ప్రిపరేషన్ ఆయన ఆధ్వర్యంలో జరగనుంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జ్ఞానేశ్వర్ పర్యవేక్షణలో జరగనున్నాయి.