Swine Flu Alert: దేశంలో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మాస్క్‌లు తప్పవనే భయాలు అప్పుడే ప్రజల్లో నెలకొన్నాయి. దీనిపై వైద్యులు ఏమంటున్నారు? ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
స్వైన్ ఫ్లూ, కరోనా గురించి ప్రజలకు చెప్పనక్కర్లేదు. వీటి బారినపడి పోగొట్టుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ కేసు పెరిగితే ప్రజల్లో కాసింత ఆందోళన మొదలవుతోంది. తాజాగా వర్షాకాలంలో H1N1 కేసుల సంఖ్యల దేశంలోని అనేక నగరాల్లో పెరుగుతోంది. ఆగస్టు 20న 114 కొత్త కేసులతో సహా ఢిల్లీలో మొత్తం 1,777 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో 229 కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల కేవలం ఢిల్లీకి పరిమితం కాలేదు.
ఫ్లూ వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు నిఘాను పెంచారు. కర్ణాటకలో జనవరి నుంచి ఇప్పటివరకు 4,212 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సుమారు 300 నుంచి 400 క్రియాశీలక కేసులు ఉన్నాయి. వీటిలో అధికశాతం కేసులు బెంగళూరు సిటీలోనే. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయి . హెచ్1ఎన్1 కడుపుపై ప్రభావం చూపి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలను కలిగిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రధానంగా ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల వంటి వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్ శ్వాసకోశ వ్యవస్థ వెలుపల లక్షణాలను కలిగించవచ్చు. వైరస్ వల్ల సదరు వ్యక్తికి వికారం, నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. పిల్లలకు జ్వరం లేదా ఇతర ఫ్లూ లక్షణాలతోపాటు వాంతులు లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ తరహా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలా అనే సందేహాలు అప్పుడే ప్రజల్లో మొదలయ్యాయి.
ప్రతి ఒక్కరు రోజంతా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. రద్దీగా ఉండే మెట్రోలు, ఆసుపత్రులు, వెయిటింగ్ రూమ్‌లు, గాలి సరిగా లేని ఇండోర్ ప్రాంతాల్లో మాస్క్ ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉన్నవారు ఇతరులకు దూరంగా ఉండాలని, బయటకు వెళ్తే మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. గాలి బాగా ఉండే ప్రదేశాలతో పోలిస్తే.. రద్దీ-మూసి ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ALSO READ: అడవి పందితో.. 14 ఏళ్ల బాలుడి విరోచిత పోరాటం.. 90 నిమిషాలు హోరాహోరీ ఫైట్!
వీటికి ఎన్ 95 మాస్క్ ఉపయోగపడుతుందని, మాస్క్ ధరించడం పూర్తి రక్షణ కాదని చెబుతున్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండటం దగ్గు-తుమ్ముల సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలు ముఖ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇక ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దీర్ఘకాలిక సమస్యలున్నవారు ఈ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అధిక జ్వరం, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వంటి లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజలు భయపడకుండా గాలి ప్రసరణ వంటి జాగ్రత్తలను పాటించాలని చెబుతున్నారు.