Uttarakhand: నిన్న దక్షిణాది, నేడు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్‌లో కొండచరియలు విరిగిపడటంతో చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. సుమారు 4 వేల మంది యాత్రికులు రహదారికి ఇరువైపులా చిక్కుకుపోయారు.
ఉత్తరాఖండ్‌లో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రిషికేశ్‌లో గంగానది హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఘాట్‌లకు రాకపోకలను పరిమితం చేశారు. రుద్రప్రయాగ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 4000 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణంతో ఆదివారం కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేశారు, హెలికాప్టర్ సేవలను రద్దు చేశారు అధికారులు.
రహదారికి ఇరువైపులా దాదాపు 4 వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. రహదారిపై శిథిలాలు పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు యంత్రాలను మోహరించినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా పనులకు ఆటంకం కలుగుతోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కేదార్‌నాథ్ యాత్రకు అధికారులు బ్రేక్ వేశారు. ఉత్తరాఖండ్‌లో రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
డెహ్రాడూన్, టెహ్రీ, హరిద్వార్, పౌరీలలో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఉత్తరకాశీ, చమోలి, నైనిటాల్, రుద్రప్రయాగ్‌లలో ఆరెంజ్ అలర్ట్ చేశారు. బాగేశ్వర్, అల్మోరా, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, పితోరాఘర్‌లలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. రుద్రప్రయాగ్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై ఉన్న శిరోబాగడ్ ప్రాంతం డ్యామేజ్ అయ్యింది. దేవి ఆలయం సమీపంలోని ఓ కొండ నుండి రహదారిపైకి అకస్మాత్తుగా భారీగా శిథిలాలు, రాళ్లు రావడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
నిమిషాల వ్యవధిలో రహదారికి ఇరువైపులా వాహనాల పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. వేలాది మంది ప్రయాణికులు ఇరువైపులా చిక్కుకుపోయారు. అధికారులు జాతీయ రహదారి నుండి శిథిలాలను తొలగించడానికి కృషి చేస్తున్నారు. పడుతున్న శిథిలాల కారణంగా రహదారిని తిరిగి తెరవడం కష్టంగా ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.