UP Elections 2027: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి సమీకరణాలు చాలా వేగంగా మారిపోతుంటాయి. ఇటీవల వెలువడుతున్న కొన్ని కీలక పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.
కాంగ్రెస్ – ఎస్పీ మధ్య పొత్తు కుదిరినట్లేనా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఫోన్ కాల్ వెనుక ఎన్నికల పొత్తు ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైందనే వార్తలు వస్తుండటంతో, త్వరలోనే సీట్ల పంపకాలపై కూడా నాయకులు సమావేశమై ఒక నిర్ణయానికి రానున్నారని సమాచారం.
ప్రతినిధులకు కీలక ఆదేశాలు
ఈ పొత్తు ప్రచారానికి బలం చేకూర్చేలా సమాజ్‌వాదీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ప్రతినిధులు, టీవీ డిబేట్లలో మాట్లాడే వక్తలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు చేయకూడదని అఖిలేష్ యాదవ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇది ఇరు పార్టీల మధ్య సఖ్యత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
2027 ఎన్నికలు.. లోక్‌సభపై ప్రభావం
ఉత్తరప్రదేశ్ 18వ శాసనసభ గడువు 2027 మార్చితో ముగుస్తుంది. నిబంధనల ప్రకారం 2027 ఫిబ్రవరి – మార్చి నెలల్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తు ఎన్నికల గురించి రకరకాల చర్చలు నడుస్తున్నప్పటికీ, అధికారికంగా మాత్రం 2027 ప్రారంభంలోనే ఇవి జరగనున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే లోక్‌సభ ఎన్నికల సరళిపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
Also Read: రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో ఈ ఒక్కటి ఆన్ చేయండి.. పొద్దున్నే చాలా ఫ్రెష్‌గా లేస్తారు!