Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో.. భారీవర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, దంతెవాడ, బీజాపుర్, సుకుమా జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. నీట మునిగి 8 మంది మృతి చెందారు. సుమారు 2,000 మందికి పైగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ వారికి తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
వారణాసిలో ఉప్పొంగుతోన్న గంగ..
అలాగే ఇక వారణాసి విషయానికి వస్తే.. గంగానది నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. దీంతో పలు ఘాట్లలో పుణ్యస్నానాలు, గంగా హారతి, దహనసంస్కారాలు, కర్మకాండలు వంటి కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాశీ శివయ్య దర్శణం కోసం వచ్చిన భక్తులు వర్షాల దర్శనం తీసుకుంటున్నారు.
జమ్మూ కశ్మీర్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య
అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌లో వర్షాలు.. ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు 41 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. అలాగే కట్రాలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడి అనేక మంది చనిపోయారు.. ఇందులో చనిపోయిన 34 మందిలో 18 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 16 మంది మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. అయితే యాత్రను కొనసాగించడంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా.
వరదకు కొట్టుకు పోయిన ప్రభుత్వ బంగ్లాలు
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో.. గురువారం రావి నదికి అకస్మాత్తుగా వరద పోటెత్తింది. దీంతో కాంగ్డా జిల్లా బడా, బంగాల్ గ్రామంలో పలు ప్రభుత్వ బంగ్లాలు కొట్టుకుపోయాయి. మండీ జిల్లాలో కొండచరియలు విరిగిపడి చండీగఢ్- మనాలి జాతీయ రహదారిలో సుమారు 50 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది.
Also Read: తెలంగాణలో క్లౌడ్ బరస్ట్‌కి కారణాలు ఇవే..
పంజాబ్‌లో వరద గుప్పెట చిక్కిన పలు జిల్లాలు
ఇక పంజాబ్‌లోని పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తర్వాత పంజాబ్‌లో భారీ వరదలు సంభవించాయి. రాష్ట్రంలో సట్లెజ్, బియాస్, రావి నదుల నీటి మట్టం భారీగా పెరిగింది. గురుదాస్ పూర్ లాసియన్ ప్రాంతంలో వరదల్లో చిక్కుకు పోయిన 27 మందిని అత్యంత సాహసోపేతంగా ఎయిర్ లిఫ్ట్ చేసింది వాయుసేన. మొత్తం 27 మందిని సురక్షితంగా తరలించింది.