IIT Baba In Kumbh Mela : కోట్ల మంది హిందువులకు పరమ పవిత్రమైన కుంభమేళా ఎన్నో వింతలు, ఎన్నెన్నో విశేషాలకు వేదికగా నిలుస్తోంది. ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయిన ఎంతో మంది మేధావులను.. సాధారణ ప్రజానీకానికి పరిచయం చేస్తుంటుంది. అలా.. ప్రస్తుత కుంభమేళలో ఓవ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తమ మేథా సంపత్తిని చూసి.. నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. అతనే.. అభయ్ సింగ్. ఎవరో సాధువును మామూలుగా పలకరించిన జర్నలిస్టుకు.. అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీర్ పూర్తి చేసినట్లు తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారగా.. ఈ యువ సాధువు గురించి తెలుసుకునేందుకు యువతరం ఆసక్తి చూపిస్తోంది. ఇతని జీవితం.. సాధారణ వ్యక్తుల జీవితాల్లోని ఎత్తు పల్లాలు మనిషిని ఎలా మార్చుతాయనే విషయం కళ్లకు కట్టడంతో పాటు చిన్నారుల జీవితాలు, ఆలోచనలపై కుటుంబంలోని పెద్దల ప్రవర్తన ఎలా పనిచేస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆధ్యాత్మిక సాధనలోని ఈ వ్యక్తి జీవిత లక్ష్యం.. ఎలా మారిందనే విషయం తెలుసుకుంటే ఓ మానసిక గ్రంథాన్ని చదివినట్లుగా.. అనేక అంశాలు మనల్ని కదిలిస్తుంటాయి. ఇంతకీ.. ఇతని కథ ఏంటి..
కోట్ల సంపాదన వద్దు.. మనశ్శాంతి కావాలి
ఐఐటీ బొంబాయి నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్న అభయ్ సింగ్.. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. IIT బాబాగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ఈ యువసాధువు.. తన గమ్యం దైవ చింతనే అని నిర్ణయించుకుని.. సామాన్య జీవితాన్ని వదులుకున్నాడు. కోట్ల ఆస్తుల్ని, కన్నవారిని కాదని.. శివనామ స్మరణలో సాధువుగా మారిపోయాడు. ఏరోస్పేస్ ఇంజినీర్ గా విదేశాల్లోని ఉద్యోగం, ఏడాదికి కోట్లల్లో జీతం.. అయినా తనకు సంతృప్తినివ్వలేదు. ఏం సాధించినా, ఎంత దూరం ప్రయాణించినా చివరికి మనశ్శాంతే గొప్పదని నిర్ణయానికి వచ్చాడు. దైవ చింతనలో.. తన జీవితాన్ని గడపాలని చిన్న వయస్సులోనే సాధువుగా మారిపోయాడు. అనుకోకుండా.. కుంభమేళలో మీడియాతో తన గత జీవితాన్ని పంచుకుని.. వైరల్ గా మారాడు.
ఇంటికి తిరిగి రావాలని తండ్రి వేడుకోలు..
చాన్నాళ్లుగా కనిపించకుండా పోయిన తన కొడుకును కుంభమేళలో కనిపించే వరకు అతని తండ్రికి ప్రాణాలు లేచివచ్చినట్లైంది. ఎటు వెళ్లాడో, ఎక్కడికి వెళ్లాడో తెలియని కొడుకు.. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతి మార్గాన్ని చేరుకున్నాడని తెలిసి సంతోషించినా.. తండ్రిగా కొడుకును తిరిగి రామంటూ వేడుకున్నాడు. ప్రేమగా పెంచుకున్న కొడుకును చూడాలనిపిస్తుందని ఇంటికి తిరిగి రావాలంటూ విజ్ఞప్తిని చేశాడు.
ఝజ్జర్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అతని తండ్రి, న్యాయవాది కరణ్ గ్రేవాల్.. అభయ్ అసాధారణ జ్ఞానం గురించిన ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి స్థానిక పాఠశాలల్లో అద్భుతంగా రాణించడంతో పాటు దిల్లీలో ఐఐటీకి సిద్ధమయ్యే వరకు అభయ్ అసాధారణ ప్రతిభావంతుడంటూ మెచ్చుకున్నారు. ముంబై ఐఐటీలో సీటు సంపాదించిన తర్వాత.. డిజైనింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి దిల్లీ, కెనడాలోని ప్రతిష్టాత్మక సంస్థలలో అభయ్ సింగ్ పనిచేసినట్లు వెల్లడించారు. కెనడాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలకు సుమారుగా రూ.3 లక్షలు సంపాదించేవాడని తెలిపారు.
చిన్నారులపై కుటుంబం ప్రభావం..
పిల్లలపై ప్రేమ చూపించడం అంటే వాళ్లు కోరుకున్నది కొనివ్వడం, పెద్ద పెద్ద బడుల్లో చదివించడం మాత్రమే కాదు. వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవడం.. నాలుగు మంచి మాటలు చెప్పడం. కానీ.. అభయ్.. చిన్నతనంలో ఇంట్లో ఎంతో బాధ అనుభవించినట్లు తెలిపాడు. బడి నుంచి ఇంటికి రావాలంటే భయం వేసేదని అన్నాడు. నిత్యం ఏదో ఓ గొడవతో.. నిత్యం గందరగోళంగా ఉండేదని, దాంతో.. తన చిన్నతనం అంతా భయంతోనే గడిచిపోయిందని అన్నాడు. తనకు చిన్నప్పుడు మానసిక ఆరోగ్య సమస్య ఉందని తెలిపాడు.
తన చిన్నతనంలో ఇంట్లోని బాధాకరమైన సంఘటనలు తనపై గణనీయమైన ప్రభావం చూపినట్లు గతంలో స్నేహితుల దగ్గర వెల్లడించాడు. తనను తల్లిదండ్రులు నేరుగా ఏం అనకపోయినా..వారిద్దరు నిరంతరం పోట్లాడుకుంటూనే ఉండే వాళ్లని వెల్లడించారు. తాను చదువుకునే రోజుల్లో.. రోజూ సాయంత్రం 5-6 గంటలకు ఇంటికి వచ్చే సరికి అంతా గందరగోళంగా ఉండేదన్నారు. దాంతో.. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు నేరుగా నిద్రపోయే వాడని అని, అర్ధరాత్రి అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, ఎవరూ గొడవలకు దిగనప్పుడు.. బయటకు వచ్చి చదువుకునే వాడినంటూ వెల్లడించారు.
చిన్నతనంలో తన తల్లితండ్రులు తగాదాలు పడుతున్నప్పుడు తాను అనుభవించిన నిస్సహాయత గురించి అనేక సార్లు వివరించి బాధపడేవాడని స్నేహితులు తెలిపారు. చిన్నప్పుడు, ఏమి జరుగుతుందో అర్థం కాక, ఎలా స్పందించాలో తెలియక, మీ మనస్సు బాగా ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. ఈ చిన్ననాటి గాయం కారణంగానే.. తాను పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. తాను పెళ్లి చేసుకుని.. తన చిన్నతనంలో చూసిన గొడవలను మళ్లీ అనుభవించాల్సి వస్తుందనే భయంతో వద్దనుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ మొత్తం ఘటనలు అతని జీవితాన్నే కాదు.. నేటి సమాజంలోని ఎంతో మంది జీవితాలకు ప్రతిబింబంగా కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఈ ఒత్తిడి ప్రపంచంలో, కుటుంబ గందరగోళ పరిస్థితులు చిన్నారుల్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నారు. అయితే.. ఈ ఒత్తిడులను తట్టుకోలేక చాలా మంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే.. అభయ్ మాత్రం మానసిక ప్రశాంతతే గమ్యంగా ఎంచుకోవడాన్ని హర్షిస్తున్నారు.
అయితే.. అందరూ అభయ్ లాగా సరైన మార్గాల్ని ఎంచుకోలేనప్పుడు… సమాజానికి ప్రమాదకరంగా మారడమో, తమకు తాము హాని చేసుకోవడమే చేస్తారంటున్నారు. అందుకే.. ప్రశాంత జీవితానికి.. పెద్దలే మార్గం చూపించాలని తల్లిదండ్రులకు మానసిక వైద్యులు సూచిస్తున్నారు.