ఇంట్లో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ కథ కంచికి చేరడానికి సమయం దగ్గరపడింది. రాజీనామాకు ససేమిరా అన్న ఆయన ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో ఈ వ్యవహారం కాస్త మలుపు తిరిగినట్టు అనిపించినా అభిశంసనకు పార్లమెంట్ సిద్ధపడటంతో ఆయన తొలగింపు లాంఛనం కాబోతోంది. జస్టిస్ యశ్వంత్ వర్మని అభిశంసిస్తూ 145 మంది లోక్ సభ సభ్యులు స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు నోటీసులు ఇచ్చారు. 63మంది రాజ్యసభ సభ్యులు కూడా నోటీసులు సమర్పించారు. న్యాయమూర్తి తొలగింపు తీర్మానంపై లోక్ సభలో కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేయాల్సి ఉండగా వర్మ తొలగింపు నోటీస్ పై మాత్రం ఏకంగా 208మంది సంతకాలు చేయడం విశేషం.
భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు తిరుగులేని రక్షణ కల్పించింది. న్యాయమూర్తులను తొలగించడం అంత ఆషామాషీ కాదు. పార్లమెంట్ లో తీర్మానం లేకుండా ఆ పని చేయలేరు. ఇలాంటి రక్షణ ఉండబట్టే భారత్ లో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయగలుగుతోంది. అంత పవిత్రమైన, రక్షణ ఉన్న న్యాయవ్యవస్థలో కూడా కొంతమంది అక్రమార్కులు ఉన్నారు. వారిని తొలగించే అధికారం రాజ్యాంగం పార్లమెంట్ కు దఖలు పరిచింది. అయితే పరిస్థితి అంతవరకు రాకుండానే.. అభియోగాలు ఎదురైన తర్వాత కొంతమంది స్వచ్ఛందంగా పదవులనుంచు వైదొలిగారు. ఇంట్లో నోట్ల కట్టలతో దొరికిన జస్టిస్ యశ్వంత్ వర్మ మాత్రం పేచీ పెట్టారు. తప్పు రూఢీ అయిన తర్వాత కూడా రాజీనామాకు ఒప్పుకోకపోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పార్లమెంట్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఆయనపై అభిశంసనకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టబోతున్నారు. 150మంది సంతకాలు సరిపోతాయనుకుంటే ఏకంగా 200కి పైగా ఎంపీలు ఆయనను తొలగించాలనే నోటీసుపై సంతకం చేశారు. వర్మ నిష్క్రమణ ఇంత ఘోరంగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం ద్వారా జస్టిస్ వర్మ పదవీచ్యుతుడు కాబోతున్నారు. సోమవారం ఈ లాంఛనం జరుగుతుంది.
జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆయన ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో అసలు కథ మొదలైంది. మంటలు ఆర్పడానికి వెళ్లిన ఫైర్ సిబ్బందికి ఇంట్లో వస్తువులతోపాటు కాలిపోయిన నోట్లకట్టలు కనపడ్డాయి. గుట్టలు గుట్టలుగా పడ్డ నోట్ల కట్టలు చూసి వారు షాకయ్యారు. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. అలా ఆ అక్రమ సంపాదన గుట్టు వీడింది. ఆ నోట్ల కట్టలకు లెక్కలు చెప్పలేని పరిస్థితుల్లో వర్మ చిక్కుకున్నారు. సుప్రీంకోర్టు అంతర్గత విచారణకోసం ఏర్పాటు చేసిన కమిటీ కూడా వర్మపై చర్యలకు సిఫార్సు చేసింది. అయితే ఆయన తనకు తానే పదవి నుంచి వైదొలిగేందుకు సుప్రీం అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు. చివరకు ఇలా పార్లమెంట్ ద్వారా అభిశంసనకు గురైన జడ్జిల్లో ఒకరిగా ఆయన మిగిలిపోతున్నారు.