INDIA Bloc : రాష్ట్రపతి భవన్ భేటీతో రాజకీయ పోరు మరో మలుపు తీసుకుంది..! ఇండియా కూటమికి చెందిన 10 మంది నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఎన్నికల సంఘంపై ఫిర్యాదు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తున్న 13.30 కోట్ల పేర్లను తిరిగి చేర్చాలని కోరారు. పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ తీసుకురావాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నది విపక్షాల ఆరోపణ. దీనికి ఆధారాలు సమర్పిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
రాహుల్ గాంధీ ట్విట్..
భేటీ తర్వాత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓటు చోరీ ఆరోపణలను రాష్ట్రపతి ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఆధారాలు తీసుకురావాలని రాష్ట్రపతి కోరారని.. వాటిని సమర్పిస్తామని ట్వీట్ చేశారు. ఆధారాలను పరిశీలించి చర్యలు తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో నిరసనలపై ఉత్కంఠ
ఇక ఇవాళ ఢిల్లీలో నిరసనలపై ఉత్కంఠ నెలకొంది. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 45 మెట్రో స్టేషన్లలో ప్రవేశం, బయటకు వెళ్లడంపై ఆంక్షలు విధించారు. కేంద్ర ఢిల్లీలోని 4 కిలోమీటర్ల పరిధిలో రాత్రి 10 గంటల నుంచి 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ మళ్లింపులు, రైళ్ల రద్దుతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రహదారుల మూసివేతలను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు కూడా సూచించింది.
ఒకవైపు ఓటు చోరీ ఆరోపణలు..
ఒకవైపు ఓటు చోరీ ఆరోపణలు.. మరోవైపు సీఈసీ రాజీనామా డిమాండ్.. ఆధారాలు సమర్పిస్తామంటున్న విపక్షాలు.. నిరసనలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న పోలీసులు.. మరి జంతర్‌మంతర్ వద్ద నిరసన ఎలా సాగుతుంది..? రాష్ట్రపతికి ఆధారాలు ఇచ్చిన తర్వాత రాజకీయ పోరు ఏ మలుపు తిరుగుతుంది..? ఢిల్లీ ఇప్పుడు ఇదే ఉత్కంఠ.
Also Read: ఆఫర్ల ఆశ.. సైబర్ మోసాల మోత! ఆన్‌లైన్‌లో కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!