Guntur Gongura Mutton: ఆంధ్రా వంటకాలంటేనే కారం, మసాలాలు, అద్భుతమైన రుచి గుర్తొస్తాయి. అందులోనూ గుంటూరు స్టైల్ ‘గోంగూర మటన్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుల్లపుల్లని గోంగూర, ఘాటైన గుంటూరు మిరపకారం, మెత్తగా ఉడికిన మటన్ కలిస్తే ఆ రుచే వేరు. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని, పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తింటే భోజనం ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. ముఖ్యంగా ఆదివారం స్పెషల్‌గా లేదా ఇంట్లో అతిథులు వచ్చినప్పుడు ఈ కూర వండితే అందరూ మరో ముద్ద ఎక్కువగానే తింటారు. మరి రెస్టారెంట్ రుచిని తలపించే గుంటూరు గోంగూర మటన్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా..
మటన్ – 500 గ్రాములు
గోంగూర – 2 కట్టలు
ఉల్లిపాయలు – 2
టమోటాలు – 2
పచ్చిమిర్చి – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – అర టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
పసుపు – అర టీస్పూన్
ఆవాలు – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
నూనె – 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
Also Read: ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ మటన్ పెప్పర్ మసాలా.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!
మీకు కావాల్సినంత మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ప్రెషర్ కుక్కర్‌లో మటన్‌కు సరిపడా నీళ్లు పోసి ముక్కలు మెత్తగా ఉడికే వరకు మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చేలా ఉడికించాలి. మటన్ రకాన్ని బట్టి విజిల్స్ సంఖ్య మారవచ్చు.
ఇప్పుడు గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి, కాడలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి గోంగూర, పచ్చిమిర్చి వేసి ఆకులు మెత్తబడే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా పేస్ట్‌లా చేసుకోవాలి.
మరో బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి ఉడికించిన మటన్‌ను వేయాలి. మసాలా ముక్కలకు బాగా పట్టిన తర్వాత గోంగూర పేస్ట్ వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా మటన్ ఉడికించిన నీళ్లు పోసి 10 – 15 నిమిషాలు చిన్న మంటపై ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఘాటైన గుంటూరు గోంగూర మటన్ సిద్ధం. వేడివేడి అన్నం, నెయ్యి లేదా రాగి సంగటితో కలిపి తింటే ఈ కూర రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
Also Read: ఒక్కసారి ఇలా షెజ్‌వాన్ చికెన్ నూడుల్స్ చేసి చూడండి.. రుచి మామూలుగా ఉండదు!