India-China Airspace Talks: పాకిస్తాన్ తమ గగనతల మార్గాలను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భాగంగా చైనాలోని షిన్‌జియాంగ్ (Xinjiang) ఆకాశమార్గాన్ని వినియోగించుకునేందుకు భారత ప్రభుత్వం బీజింగ్‌తో చర్చలు జరుపుతోంది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సమిట్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరైన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్ నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లే విమానాలు పాకిస్తాన్ వైపు వెళ్లకుండా చైనా షిన్‌జియాంగ్ ప్రావిన్స్ లోని హోతాన్ (Hotan) మీదుగా రూట్ మళ్లించే ప్రతిపాదనపై గత ఏడాది కాలంగా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రత్యామ్నాయ మార్గాల కేటాయింపుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొద్దికాలంగా చైనా అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతోంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే భారత విమానాలకు ప్రయాణ సమయంతో పాటు ఇంధన ఖర్చులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
గగనతల మార్గానికి సంబంధించిన చర్చలు ఓవైపు కొనసాగుతున్న క్రమంలోనే ఇరు దేశాల మధ్య విమాన సేవల పునరుద్ధరణ వేగవంతమైంది. ఆరేళ్లుగా నిలిచిపోయిన గువాంగ్‌జౌ – న్యూఢిల్లీ విమాన సర్వీసులను సెప్టెంబర్ 21 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. అటు దక్షిణాసియా ప్రాంతాలతో కనెక్టివిటీ పెంచేందుకు వారానికి 100కు పైగా విమానాలను నడుపనున్నట్లు సదరు సంస్థ తెలిపింది.
ఇదిలా ఉంటే భారతీయ విమానయాన సంస్థల్లో ఇండిగో (IndiGo) గతేడాది అక్టోబర్ లోనే కోల్‌కతా-గువాంగ్‌జౌ మధ్య సేవలను ప్రారంభించడం గమనార్హం. ఆ తర్వాత నవంబర్‌లో ఢిల్లీ-గువాంగ్‌జౌ మధ్య విమాన సేవలను పునరుద్ధరించింది. మరోవైపు ఎయిర్ ఇండియా (Air India) ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఢిల్లీ-షాంఘై మధ్య వారానికి నాలుగు విమానాలతో సర్వీసులను తిరిగి ప్రారంభించి మార్చి 29 నాటికి వాటిని వారానికి ఐదు విమానాలకు పెంచింది.
Also Read: పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా గతేడాది ఏప్రిల్ నుంచి పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు పూర్తిగా మూసివేసింది. రెండు వారాల క్రితమే ఈ ఆంక్షలను మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది. పాక్ తో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు సజావుగా సాగేందుకు చైనాతో కలిసి ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించడం భారత్‌కు ఎంతో కీలకంగా మారింది.
Also Read: జీతం ఎక్కువ ఉన్నా ధనవంతులు కాలేకపోతున్నారా? కోటీశ్వరులను చేసే.. 5 గోల్డెన్ సూత్రాలు మీకోసం!