New Airlines In India : భారత్ లో విమాన ప్రయాణికుల సంఖ్య ఏటికేటా గణనీయంగా పెరిగిపోతుంది. విస్తరిస్తున్న మార్కెట్లో మెజార్టీ వాటాను అందుకునేందుకు అన్ని ఎయిర్ సర్వీసెస్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు మరో మూడు నూతన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. దేశంలోని వివిధ సర్వీసు రూట్లల్లో ప్రయాణించేందుకు.. మూడు కొత్త సంస్థలు ప్రణాళికల్ని రూపొందించుకుంటున్నాయి. నూతన సంస్థల రాకతో ధరల పోటీ ఉంటుందని, సామాన్యులు, మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులోకి ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు. నూతన సంస్థలు వస్తున్నాయంటే.. దేశీయ మార్కెట్ ఆశాజనకంగా ఉన్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.
కొత్త సంస్థలు ఇవే
ఈ ఏడాది నుంచే దేశంలో కార్యకలాపాలు ప్రారంభించనున్న మూడు సర్వీసుల పేర్లు సైతం వెల్లడయ్యాయి. వాటిలో శంఖ్ ఎయిర్, ఎయిర్ కేరళ సంస్థలుండగా, వీటితో పాటుగా అల్హింద్ ఎయిర్ సర్వీసెస్ మరికొన్ని నెలల్లోనే వాణిజ్య రవాణా మొదలు పెట్టనున్నాయి. ఈ నూతన సంస్థల రాకతో భారత విమానయాన రంగం 2025లో సరికొత్త స్థితికి చేరుకుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం.. ఇండియాలో 12 ప్రయాణీకుల విమానయాన సంస్థలు పనిచేస్తున్నాయి. అయినా వీటిలో రెండు సంస్థలకు చెందిన ఎయిర్ సర్వీసుల నుంచే దాదాపు 90% కంటే ఎక్కువ ప్రయాణీకులు ట్రావెల్ చేస్తున్నాయి. అయితే.. దేశంలో పెరుగుతున్న విమానాశ్రయాల సంఖ్య, వృద్ధి చెందుతున్న విమాన ప్రయాణ ప్రాధాన్యతలు..మార్కెట్లో కొత్త పోటీదారులకు గణనీయమైన అవకాశాలు ఏర్పడుతున్నాయి.
భారత్ లో కొత్త విమానయాన సంస్థలు
కొత్త సంస్థల్లో “శంఖ్ ఎయిర్” సంస్థ ఒకటి. ఇది ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడ అంతర్జాతీయ విమానాశ్రయం (DXN) నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది. అలాగే.. కేరళ నుంచి రెండు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వాటిలో.. ఎయిర్ కేరళ, అల్హింద్ ఎయిర్ సంస్థలున్నాయి. ఈ సర్వీసులు దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ కనెక్టివిటీ పెంచడంతో పాటుగా, గల్ఫ్ దేశాలకు భవిష్యత్తులో విస్తరణపై దృష్టిలో పెట్టుకుని సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థల కేరళ నుంచి ప్రారంభమయ్యే మొదటి షెడ్యూల్డ్ క్యారియర్‌గా అవతరించడానికి పోటీ పడనున్నాయి.
ఈ మూడు క్యారియర్‌లు దేశంలో సర్వీసులు ప్రారంభించేందుకు 2024లోనే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) నుంచి తమ నిరభ్యంతర సర్టిఫికెట్‌లను (NOCలు) అందుకున్నాయి. అవి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి తుది ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్‌ల (AOC) కోసం ఎదురుచూస్తున్నాయి.
పెరుగుతున్న అవకాశాలు
భారత్ లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. దేశీయ పౌర విమానయాన శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.13 కోట్లకు చేరుకోగా.. ఇది 2023తో పోలిస్తే 6 శాతం వృద్ధి రేటును సాధించినట్లుగా చెబుతున్నారు. 2024 డిసెంబర్ ఒక్క నెలలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.49 కోట్లుగా నమోదైంది. అంతకు క్రితం 2023 డిసెంబర్‌తో పోల్చితే.. ఈ ఒక్క నెలలోనే 8.19 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.
Also Read : Mukesh Ambani – OpenAI Meta : ఇక AI పని పడదామా – AI లో పెట్టుబడులకు రిలయన్స్ రెడీ
ఇక 2025 జనవరిలోనూ దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ఆశాజనకంగానే ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నెలలో 1.50 కోట్ల దేశీయ విమాన ప్రయాణాలు చోటుచేసుకోగా.. ఇది డిసెంబర్‌తో పోలిస్తే 0.7 శాతం, 2024 జనవరిలో పోలిస్తే ఏకంగా 14.5 శాతం పెరుగుదలను సూచిస్తున్నాయి.