Russian Oil: ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు.. మరోవైపు టారిఫ్‌ల మోత.. ఇలాంటి సమయంలో కూడా రష్యా చమురు దిగుమతులను ఆపలేదు భారత్. ఇదే సమయంలో యూరోపియన్ దేశాలకు ఎగుమతులను కూడా ఆపలేదు. ఈయూ దేశాలకు భారత్ నుంచి డీజిల్ ఎగుమతులు రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. ఎంతలా అంటే ఒక్క ఆగస్టులోనే 137 శాతం పెరిగాయి ఈ ఎగుమతులు. ఓ వైపు రష్యాపై విమర్శలు చేస్తూ.. ఆంక్షలు విధిస్తూనే.. రష్యా చమురును రిఫైన్ చేసి తయారు చేస్తున్న డీజిల్‌ను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాయి ఈయూ దేశాలు.
ఆగస్టులో రోజుకు 2,42,000 బ్యారెల్స్ ఎగుమతులు
ఆగస్టులో భారత్ నుంచి రోజుకు 2 లక్షల 42 వేల బ్యారెల్స్ డీజిల్‌ను దిగుమతి చేసుకున్నాయి ఈయూ దేశాలు. అంతకుముందు నెల.. అంటే జులైతో పోల్చితే ఇది 73 శాతం అధికం. అయితే డీజిల్ ఎగుమతులు ఈ స్థాయిలో పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇప్పటికే ఈయూ దేశాలు కూడా భారత్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఈ ఆంక్షలు అమల్లోకి వస్తే పరిస్థితి ఏంటి? అనేది ఆ దేశాల సందేహం. అందుకే ముందుస్తుగా భారీగా దిగుమతులు పెంచుకొని స్టోర్ చేసుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు చలికాలం వస్తుండటం కూడా ఓ కారణం.
ఈయూకు మిడిల్ ఈస్ట్ నుంచి అధికంగా చమురు దిగుమతులు
వీటితో పాటు ఈయూ దేశాల్లోని రిఫైనరీలు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో రిఫైనరీలు మెయింటనెన్స్ జరిగే అవకాశం ఉండటం. చమురు సరఫరా ఉన్నా రిఫైనరీలు పనిచేయకపోతే ఫలితం శూన్యం. అలాంటి సమయంలో ఈ దిగుమతులు ఉపయోగపడతాయనేది ఆ దేశాల ఆలోచన. మిడిల్ ఈస్ట్‌లోని రిఫైనరీల్లో అక్టోబర్, నవంబర్‌లో మెయింటనెన్స్ చేపట్టే అవకాశం ఉంది. ఎన్ని ఆంక్షలు ఉన్నా.. విమర్శలు వచ్చినా ఇప్పటికీ కూడా రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను ఈయూ దేశాలు దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి. అయితే వీటిపై కూడా త్వరలోనే ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇది కూడా దిగమతులు పెరగడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
Also Read: 150 ఏళ్లు బతకొచ్చు.. ఎలాగంటే..! పుతిన్ చెప్పిన సీక్రెట్స్..
ముందస్తు జాగ్రత్తగా దిగుమతులు పెంచిన ఈయూ
ఇప్పుడు ఈయూ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. ఎందుకంటే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు.. అలాగని భారత్‌లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటామంటే అమెరికా అడ్డుపడేలా ఉంది. దీంతో ముందుకు వెళ్తే నుయ్యి.. వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది వాటి పరిస్థితి. నిజానికి రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురును రిఫైన్ చేసి తమకు ఎగుమతి చేయడాన్ని ఈయూ ఇష్టపడటం లేదు. అందుకే తమకు ఎగుమతి చేసే చమురు ఎక్కడి నుంచి వచ్చిందో తెలపాలనే నిబంధనను తీసుకొచ్చింది కూడా. కానీ దానిని అమలు చేసే ధైర్యం మాత్రం చేయడం లేదు ఈయూ.