India’s Iron Dome: శత్రువుల గుండెలు అదిరేలా.. ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టేలా.. ఒక్కసారి ప్రయోగిస్తే శత్రు సంహారం చేసి వచ్చే సుదర్శన చక్ర వ్యూహాన్ని భారత్ అమలు చేయబోతోంది. అది మామూలుగా ఉండదు. దేశాన్ని రక్షించుకుంటూనే.. ప్రత్యర్థిపై పకడ్బందీ వ్యూహాలతో దాడి చేయడం ఈ మిషన్ ఉద్దేశం. వచ్చే పదేళ్లు కీలకం. ఇజ్రాయెల్ కు ఎలాగైతే మిసైళ్ల నుంచి రక్షణకు ఐరన్ డోమ్ ఉందో మనకూ ఓ ఐరన్ డోమ్ రాబోతోందన్న మాట. ఇంతకీ మిషన్ సుదర్శన చక్ర వ్యూహమేంటి? ఇది ఎలా పని చేయబోతోంది??
మిషన్ సుదర్శన చక్ర గేమ్ ఛేంజర్
జల, వాయు, భూ మార్గాలు అన్నీ ఇక శత్రు దుర్బేధ్యం కాబోతున్నాయ్.. “మిషన్ సుదర్శన చక్ర” ప్లాన్ తో కథ మారబోతోంది. ఎర్ర కోట నుంచి ప్రధాని మోడీ సుదర్శన చక్రాన్ని శత్రువులపై ప్రయోగించేశారు.. మనవైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు రాబోతున్నాయ్. వచ్చే పదేళ్లలో మన డిఫెన్స్ సిస్టమ్ మొత్తం మారిపోనుంది. దాడులను ఎదుర్కోవడం, కచ్చితత్వంతో ప్రతిదాడి చేయడం ఇది జరగబోతోంది. అయితే ఇది రెగ్యులర్ గా జరిగేదే కదా అని అనుకోవద్దు. అక్కడే అసలైన చక్ర వ్యూహం ఉంది.
లక్ష్యాన్ని ఛేదించి ప్రయోగించిన చోటికే రాక
పురాణాల్లో సుదర్శన చక్రానికి ప్రాధాన్యత ఎంతో ఉంది. ధర్మాన్ని స్థాపించి.. అధర్మాన్ని అంత చేయడమే ఈ ఆయుధం సృష్టికి కారణం. సుదర్శన చక్రానికి ముల్లోకాల్లో ఏ అడ్డూ లేదు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి వంద తప్పుల తర్వాత చంపడానికి ప్రయోగించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు జయద్రథుడిని సంహరించడంలో సహాయం చేసేందుకు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సూర్యకాంతిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు. దీంతో జయద్రథుడు బయటకు వచ్చి అర్జునుడు వేసిన బాణంతో చనిపోయాడు. సుదర్శన చక్రం ఆధునిక యుగంలో ఒక గైడెడ్ మిసైల్ లాంటిదన్న మాట. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి తిరిగి ప్రయోగించిన చోటికి చేరుకుంటుంది. అందుకే ప్రధాని మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ ప్రస్తావన చేశారు.
దేశ భద్రతను ఆధునీకరించడం, రక్షించడం లక్ష్యం
శ్రీకృష్ణ జన్మాష్టమికి ఒక రోజు ముందు ప్రధాని మోడీ ప్రస్తావించిన మిషన్ సుదర్శన చక్రకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ దేశ భద్రతను ఆధునీకరించడం, దేశంలోని కీలక స్థలాలను రక్షించడం లక్ష్యం. ఇది ఒక మోడ్రన్ డిఫెన్స్ సిస్టమ్ అన్న మాట. ఈ మిషన్ శ్రీకృష్ణ భగవానుడి సుదర్శన చక్రం నుంచి స్ఫూర్తి పొంది రూపకల్పన చేస్తున్నారు. ఇది కచ్చితమైన లక్ష్య సాధన అలాగే శత్రువుల దూకుడును అడ్డుకోవడంలో పవర్ ఫుల్ గా పని చేస్తుందన్నారు ప్రధాని. ఈ మిషన్ ద్వారా 2035 నాటికి ఇండియాలోని కీలక స్థలాలైన రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్, మతపరమైన ప్రదేశాలు, పారిశ్రామిక కేంద్రాలు సహా ఇతర స్ట్రాటజిక్ లొకేషన్లను రక్షించే ఒక సమగ్ర జాతీయ భద్రతా కవచంగా ఉండబోతోంది. సో అధునాతన సర్వైలెన్స్, సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల రక్షణను చేసే బహుముఖ రక్షణ వ్యవస్థగా ఈ మిషన్ సుదర్శన చక్ర ఉండబోతోంది. ఈ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ సాంకేతికత, R&Dతో చేస్తామన్నారు ప్రధాని. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తామంటున్నారు. దేశ యువత ప్రతిభను ఉపయోగించి ఈ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేస్తామంటున్నారు. ఈ సిస్టమ్ డ్రోన్లు, క్రూయిజ్ మిస్సిల్స్, బాలిస్టిక్ మిస్సిల్స్ వంటి ఎటాక్స్ ను ఎదుర్కొనేలా రూపొందిస్తారు. ప్రతి ఒక్కరికి రక్షణ. అందరికీ భద్రత కల్పించేలా ఎవరు ఏ టెక్నాలజీతో వచ్చినా వాటికంటే మనదే అత్యున్నతంగా ఉండేలా చేయబోతున్నారు.
గోల్డెన్ డోమ్ తయారీలో అమెరికా
రియాక్టివ్ గా కాదు.. ప్రొయాక్టివ్ గా ఉండాలి. ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కోవడం కాదు.. దాడికి ముందే పసిగట్టి తిప్పికొట్టడం, ఎదురు దాడి చేయడం.. ఇదే ఆధునిక యుద్ధ తంత్రం. అదే మిషన్ సుదర్శన చక్ర వ్యూహం. అందుకే మనకూ ఓ ఐరన్ డోమ్ కావాల్సిందే. ఇప్పటికే ఇజ్రాయెల్ కు ఉంది. అటు అమెరికా కూడా గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. శత్రువుల నుంచి రక్షణకు మిషన్ సుదర్శన చక్రలో భాగంగా ఐరన్ డోమ్ రాబోతోంది. మరి ఈ డోమ్ ఎలా ఉండబోతోంది? ఐరన్ డోమ్.. గోల్డెన్ డోమ్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవి శత్రు దేశాల మిసైల్స్ నుంచి రక్షించేలా ఉపయోగపడుతున్నాయి. గాల్లోనే పేల్చేస్తున్నాయి. ఇజ్రాయెల్ అనుభవం ప్రపంచం ముందు ఉంది. అలాగే అమెరికా కూడా గోల్డెన్ డోమ్ ప్రయత్నాల్లో ఉంది. సో మనకూ ఓ ఐరన్ డోమ్ అవసరం అనుకుంటున్నారు. మిషన్ సుదర్శన చక్రలో భాగంగా ఇలాంటి డోమ్ మనకూ రాబోతోంది. ఈ మిషన్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాగా అన్ని ముప్పుల నుంచి దేశాన్ని కాపాడుతూ రక్షణ కవచంగా పనిచేస్తుందంటున్నారు మోడీ. సుదర్శన చక్రతో భారత్ సొంత ఐరన్ డోమ్ దిశగా అడుగులు వేయబోతోందన్న మాట.
2011 నుంచి ఇజ్రాయోల్ ఐరన్ డోమ్
ఐరన్ డోమ్ అనగానే అందరికీ ముందుగుర్తొచ్చేది ఇజ్రాయెల్. ఈ డోమ్ ను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది. ఇదో యాంటీ మిసైల్ సెక్యూరిటీ సిస్టమ్. 2011 నుంచి ఆపరేషనల్‌గా ఉంది. ఇజ్రాయెల్ బహుళ స్థాయి రక్షణ వ్యవస్థలో భాగం. హమాస్, హిజ్బుల్లా వంటి శత్రువుల నుంచి వచ్చే మిసైల్స్, ఆర్టిలరీ షెల్స్‌ను అడ్డుకోవడానికి తయారు చేసుకున్నారు. ఇజ్రాయెల్ భౌగోళిక విస్తీర్ణం చాలా చిన్నది. అందుకే ఈ ఐరన్ డోమ్ కాన్సెప్ట్ ను వాళ్లు డెవలప్ చేసుకున్నారు. రాడార్ సహా ఇతర టెక్నిక్స్ తో మిసైల్స్ ను గుర్తిస్తారు. గాల్లోనే పేల్చేస్తారు. ఈ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కు 90% కంటే ఎక్కువ సక్సెస్ రేటు ఉంది. 5 వేలకు పైగా మిసైళ్లను అడ్డుకుంది.
స్పేస్ బేస్డ్ థ్రెట్స్‌ను అడ్డుకోవడం లక్ష్యం
అటు అమెరికా కూడా గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 27న ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇదో మల్టీ లేయర్డ్ క్షిపణి రక్షణ వ్యవస్థ. 2028-2029 నాటికి పూర్తిగా ఆపరేషనల్ కావాలని అమెరికా టార్గెట్ పెట్టుకుంది. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లైన్ లో ఉన్నప్పటికీ భౌగోళికంగా అమెరికా పెద్దది. అందుకే ఇంకాస్త అడ్వాన్స్ డ్ గా ఉండబోతోంది. బాలిస్టిక్, హైపర్‌సోనిక్, క్రూయిజ్, డ్రోన్ స్వార్మ్‌లు, స్పేస్ బేస్డ్ థ్రెట్స్ ను అడ్డుకోవడం ఈ గోల్డెన్ డోమ్ ముఖ్య ఉద్దేశం. రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా, కెనడాల నుంచి వచ్చే థ్రెట్స్ నుంచి కాపాడుకునేలా ట్రంప్ ప్లాన్ చేసుకుంటున్నారు.
542 బిలియన్ డాలర్ల దాకా అంచనాలు
గోల్డెన్ డోమ్ నాలుగంచెల్లో ఉంటుంది. స్పేస్-బేస్డ్ సెన్సింగ్, టార్గెటింగ్, బూస్ట్ ఫేజ్ ఇంటర్‌సెప్షన్, గ్రౌండ్ బేస్డ్ ఇంటర్‌సెప్టర్స్, నాన్ కైనెటిక్ డిఫెన్సెస్ సైబర్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఖర్చు అంచనా 175 బిలియన్ డాలర్ల నుంచి 542 బిలియన్ డాలర్ల దాకా ఉండొచ్చంటున్నారు. సో మన దగ్గరా మిషన్ సుదర్శన చక్రలో భాగంగా ఐరన్ డోమ్ కు రెడీ అవుతోంది భారత్. అయితే ఈ ప్రాజెక్ట్ అంచనాలు, ఎలా చేస్తారు ఏం చేస్తారన్నది పూర్తిగా తెలియకపోయినా.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పట్టాలెక్కుతుందంటున్నారు. పదేళ్లలో ఈ రక్షణ వ్యవస్థలన్నీ అందుబాటులోకి రానున్నాయి.
IACCS నెట్‌వర్క్‌తో సుదర్శన చక్ర లింకప్
సుదర్శన్ చక్రం ఎంత కచ్చితత్వంతో ఉంటుందో.. తాము కూడా అంతే కచ్చితత్వంతో రక్షణ వ్యవస్థలను రెడీ చేస్తామంటున్నారు ప్రధాని మోడీ. మిషన్ సుదర్శన్ చక్ర ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ – IACCS నెట్‌వర్క్‌ను ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్‌తో కలిపే వీలు ఉంటుందని డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ ప్రణాళికలు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయ్. IACCS అన్నది పూర్తిగా ఆటోమేటెడ్, రియల్ టైమ్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సిస్టమ్. ఇది కంప్లీట్ గా సెన్సార్లు, రాడార్లు ఆయుధ వ్యవస్థలను లింకప్ చేస్తుంది. త్రివిధ దళాల ఆపరేషన్స్ ను కోఆర్డినేట్ చేస్తుంది.
Also Read: నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. బయటకు వెళ్లొద్దు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ.., దేశమంతా మల్టీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్షన్ సెంటర్లు అలాగే కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సెంటర్లను కలుపుతుంది. ఇది రియల్ టైమ్ ఎయిర్‌స్పేస్ సర్వైలెన్స్, ముప్పును అంచనా వేయడం వంటివి చేస్తుంది. IACCS హై స్పీడ్ ఎయిర్ ఫోర్స్ నెట్‌వర్క్ పై పనిచేస్తుంది. ఇది ఫైబర్ఆప్టిక్ బేస్డ్ వైడ్ బ్యాండ్‌విడ్త్ కమ్యూనికేషన్ గ్రిడ్. సెన్సార్లు, ఫైటర్ జెట్‌లు, ఆకాష్ సహా ఇతర క్షిపణులు, అలాగే S-400 వంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ మధ్య హైస్పీడ్ ఇన్ఫర్మేషన్ కు యూజ్ అవుతుంది. అంటే శత్రువులను ఎదుర్కోవడం కాదు.. వారి కదలికలను అంచనా వేసి రివర్స్ లో కౌంటర్ ఇవ్వడం అన్న మాట. ఆపరేషన్ సిందూర్ టైంలో మనదేశ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ గ్రిడ్ అలాగే ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్స్ అద్భుతంగా వర్కవుట్ చేశాయి. పాకిస్తానీ డ్రోన్లు, క్షిపణులను ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేశాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే 2008 ముంబై దాడుల వంటి భద్రతా లోపాలనుంచి సమర్థమైన రక్షణ కవచాన్ని అందిస్తాయంటున్నారు. దేశ రక్షణ సామర్థ్యాలను ఆధునీకరించడంతో పాటు, సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేలా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది. అదే మోడీ ప్లాన్.
Story By Vidya Sagar, Bigtv