IPS Officer Sanjiv Bhatt| మోడీ వ్యతిరేకిగా గుజరాత్, జాతీయ రాజకీయాల్లో ప్రాచుర్యం పొందిన మాజీ ఐపిఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌కు గుజరాత్ లోని పోర్బందర్ కోర్టు 27 ఏళ్ల క్రితం నాటి ఒక లాకప్ డెత్ కేసులో నిర్దోషిగా తేల్చింది. నిందితులు సంజీవ్ భట్, వాజుభాయ్ చౌకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ లాయర్ బలమైన ఆధారాలు చూపలేదని అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ముకేశ్ పాండ్యా శనివారం డెసెంబర్ 7, 2024న తీర్పు వెలువరించారు.
1997 సంవత్సరంలో పోర్బందర్ లో అప్పటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) ఐపిఎస్ సంజీవ్ భట్, కానిస్టేబుల్ వాజుభాయ్ చౌ ఇద్దరూ కలిసి ఒక పేరొందిన రౌడీ షీటర్ నారన్ జాదవ్ పోస్తరియా అలియాస్ రౌడీ సుధాని టాడా కేసులో (TADA [Terrorist and Disruptive Activities (Prevention) Act] ) అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో అతనికి చిత్రహింసలు (టార్చర్) పెట్టారని.. అందువల్లే అతను చనిపోయాడని ఆరోపణలున్నాయి. దీంతో ఐపిఎస్ సంజీవ్ భట్, కానిస్టేబుల్ వాజుభాయ్ చౌ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 330 (బలవంతంగా నేరం అంగీకరించేందుకు హింసించడం), సెక్షన్ 324 (ప్రమాదకర ఆయుధాలతో హనికలిగించడం) కింద కేసు నమోదైంది. రౌడీ షీటర్ నారన్ జాదవ్ పాకిస్తాన్ నుంచి పోర్బందర్ కు సముద్ర మార్గాన ఆడిఎక్స్ బాంబులు దొంగచాటున తీసుకొచ్చాడని అతడిని అదుపులోకి తీసుకొని వీరిద్దిరూ అతను చనిపోయేంత వరకు టార్చర్ చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
Also Read: ఇండియాలో మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్ర.. బిజేపీ ఆరోపణలు
రౌడీ షీటర్ నారన్ జాదవ్ చేత నేరం అంగీకరించేందుకు అతని లాకప్ లో ఎలెక్ట్రిక్ షాకులు ఇచ్చారు. ముఖ్యంగా రౌడీ షీటర్ ప్యాంటు విప్పి అతని మర్మాంగాల్లో, ఛాతి, నాలుక భాగాల్లో కరెంట్ షాకులిచ్చారు అని ప్రాసిక్యూషన్ లాయర్ వాదించారు. 2019లో జామ్ నగర్ కోర్టు ఈ కేసులో ఇద్దరు నిందితులు.. సంజీవ్ భట్, కానిస్టేబుల్ వాజుభాయ్ చౌకు జీవిత కాలం జైలు శిక్ష విధించింది.
అయితే జామ్ నగర్ కోర్టు తీర్పును పోర్బందర్ కోర్టు తప్పబట్టింది. ఈ కేసులో కేవలం సాక్ష్యాలే తప్ప ఆధారాలు లేవని చెప్పింది. అందుకోసం ఈ కేసుని కొట్టి వేసింది. ఈ కేసులో రెండు నిందితుడు కానిస్టేబుల్ వాజుభాయ్ కొన్ని నెలల క్రితం మరణించడంతో అతడి పేరుని ఈ కేసు నుంచి తప్పించారు.
అయితే 2018లో రాజస్థాన్ కు చెందని ఒక లాయర్ ఇంట్లో ఐపిఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ దొంగచాటుగా డ్రగ్స్ పెట్టి.. లాయర్ ను డ్రగ్స్ కేసు నమోదు చేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలున్నాయి. ఈ రెండో కేసులో మార్చి 2024న సంజీవ్ భట్ కు కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మరోవైపు 2002లో గుజరాత్ గోధ్రా అల్లర్లు ఉన్నాయి. ఆ సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముస్లింలపై దాడులు చేసేందుకు ప్రేరేపించారని.. పోలీసుల అధికారులు దాడుల చేసేవారిని అరెస్టు చేయకూడదని ఆదేశించారని సంజీవ్ భట్ ఆరోపణలు చేశారు. నరేంద్ర మోడీ స్వయంగా పోలీసులు సమావేశంలో ఈ మాటలన్నారని.. తాను ఆ సమావేశంలో ఉన్నానని ఐపిఎస్ సంజీవ్ భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా కేసులో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా ఆధారాలు నాశనం చేసేందుకు తనను ఆదేశించారని.. కానీ అందుకు తాను అంగీకరించలేదని కూడా చెప్పారు.
తనపై పెట్టిన కేసులన్నీ నకిలీవని.. కేవలం తాను మోడీ చేసిన నేరాలను బయటపెట్టినందుకే ఈ కేసుల్లో తనను ఇరికించారని అన్నారు.