Jammu and Kashmir : ఇజ్రాయిల్ పైకి యుద్ధానికి కాలుదువ్వి కోలుకోలేని విధంగా తీవ్రంగా నష్టపోయిన ఇస్లామికి ఉగ్రసంస్థ హమస్.. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిఘా, సైనిక చర్యలతో గణనీయంగా బలహీనపడిన జైష్-ఎ-మహమ్మద్ (జేఎం) ఉగ్రవాద సంస్థ.. విదేశీ ఉగ్రవాద సంస్థ సహాయంతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్ము కశ్మర్ లో తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భారత నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి.
ఈ నెల ఫిబ్రవరి 5న పీఓకేలో కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా రావల్కోట్‌లోని సబీర్ స్టేడియంలో ఓ సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాశ్మీర్ సాలిడారిటీ అండ్ హమాస్ ఆపరేషన్ ‘అల్ అక్సా ఫ్లడ్’ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో హమాస్‌కు చెందిన సీనియర్ నేత ప్రసంగించనున్నట్లు సమాచారం అందింది. ఈ సమావేశంలో ఉగ్ర సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సహా ఇతర ఉగ్రవాద సంస్ధల సీనియర్ నాయకులు కూడా పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రతినిధి ఖలీద్ కద్దౌమి పాల్గొంటారు. హమస్ పోరాటాలతో పాటు కశ్మీర్ అక్రమణ కోసం ప్రసగించనున్నట్లు ఆ ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. స్థానికంగా వివిధ మార్గాల్లో హమస్ ప్రతినిధి హజరు గురించి సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఈ సభలో జైషే ముహమ్మద్, లష్కరే తోయిబా ముఖ్య వ్యక్తులు ప్రసంగిస్తారని భావిస్తున్నారు, వీరిలో జేఈఎం చీఫ్ మౌలానా మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్ కూడా ఉన్నారు. జేఈఎం లాంచింగ్ కమాండర్ అస్గర్ ఖాన్ కాశ్మీరీ, సీనియర్ జేఈఎం కమాండర్ మసూద్ ఇలియాస్ కూడా ప్రసంగిస్తారు. అక్టోబర్ 5న కాశ్మీర్ సంఘీభావం, ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మంది ఇజ్రాయెల్ సైనికులను బలిగొన్న”ఆపరేషన్ అల్ అక్సా” ఆపరేషన్ కు ముడి పెట్టి నాయకులు ప్రసంగించవచ్చని భావిస్తున్నారు. జిహాదీ సంస్థలు తమ వాదనలకు బలం చేకూర్చేలా.. ఇటీవల ఇజ్రాయిలీ ఆర్మీతో పోరాటాన్ని, హమస్ రచించిన వ్యూహాలు, అమలు చేసిన విధానాలను వివరిస్తూ.. కశ్మీర్ ను, పాలస్తీనాను ఒకే విధమైన పోరాటాలుగా మలిచి… ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి హమాస్‌ను అధికారికంగా ఆహ్వానించే అవకాశం ఉంది. ఇరాన్‌లో హమాస్ ప్రతినిధిగా ఉన్న డాక్టర్ ఖలీద్ ఖద్దౌమి ముఖ్య వక్తలలో ఒకరుగా ఉండనున్నారు. హమాస్‌తో సంబంధం ఉన్న ఇతర నాయకులు కూడా పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్ లో నిర్వహించనున్న సమావేశంలో ఉంటారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా..ఈ కార్యక్రమాన్ని గురించి భారత నిఘా, భద్రతా సంస్థలు నిశితంగా పర్యవేక్షిస్తాయి.
2019లో ఐక్యరాజ్యసమితి జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. CRPF కాన్వాయ్‌పై దాడి చేసి 40 మంది సైనికులను చంపడంతో సహా అనేక ఉగ్రవాద సంబంధిత కేసుల్లో మసూద్ దోషిగా తేలాడు. అలాంటి కిరాతక ఉగ్రవాదితో సహా కీలక ఉగ్రనాయకులంతా ఒక్కచోటే సమావేశమవుతుండడంతో.. భారత్ అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే..భారత్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్‌పై హైలెవల్ మీటింగ్‌ను నిర్వహించారు.
Also Read : త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం..
పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు సరిహద్దు ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితులను, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల స్థితిగతులపై ప్రత్యేకంగా పర్యవేక్షించారు. వివిధ అంశాల్లో అధికారులకు సూచనలు చేసిన కేంద్ర హోం మంత్రి.. కశ్మీర్ లో ఫిబ్రవరి 5న హైఅలర్టు కొనసాగించాలని సూచించారు. ఆలోపుగానే.. రాష్ట్రంలోని ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.