Kashmir terrorist attack: కర్నాటక రాష్ట్రం, బెంగళూరుకు చెందిన 41 ఏళ్ల భరత్ భూషణ్ నిన్న కశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతిచెందాడు. దాడి జరిగిన సమయంలో అతనితో పాటు ఆయన భార్య సుజాత, మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరు దాడి నుంచి బయటపడ్డారు.
ఈ ఉగ్రదాడిలో తన భర్తను భరత్ ను దారుణంగా కాల్చి చంపారని భార్య సుజాత ఆవేదన వ్యక్తం చేసింది. ‘దాడి సమయంలో భరత్ కుమారుడిని ఎత్తుకుని ఉన్నాడు.. దుండగులు బిడ్డను కిందపడేయమని హెచ్చరించారు. ఆ పై ఆయన చనిపోయే వరకు తీవ్రంగా కాల్పులు జరిపారు’ అని పోలీస్ అధికారులకు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది.
ఈ రోజు మధ్యాహ్నం భరత్ అత్తగారు విమల ఈ సంఘటన గురించి తెలుసుకుని తన కూతురు సుజాతకు కాల్ చేశారు. జరిగిన దారుణం గురించి వివరించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. ఉగ్రవాదులు తమ పేర్లు, మతం అడిగారని.. ఆధార్ కార్డులు చూపించాలని డిమాండ్ చేశారని చెప్పింది.
‘ఉగ్రవాదులు కిరాతకంగా ప్రవర్తించారు. వారు నా కూతరు, అల్లుడి ఆధార్ కార్డులు చూపించమని అడిగారు. కార్డు చూశాక భరత్ ను దారుణంగా కాల్చి చంపారు. నువ్వు ముస్లింవా.. లేక హిందువా..? అని అడిగారు. మా అల్లుడు భరత్ బిడ్డను తీసుకుని వెళ్తుంటే.. ఉగ్రవాదులు బిడ్డను కింద పడేసి.. ఆ పై కాల్చి చంపారు’ అని విమల చెప్పుకొచ్చింది.
అయితే భరత్ ఇంటి పక్కన్ వారు మాట్లాడుతూ.. ‘కశ్మీర్ చాలా సురక్షితమైన, ప్రశాంతమైన నగరం అని తెలుసుకున్న తర్వాత భరత్ అక్కడ నుంచి వెళ్లడానికి ఆసక్తి చూపాడు. మేం కూడా గతంలో కశ్మీర్ కు వెళ్లాం. అక్కడ ప్రశాంతంగా ఉందని చెబితే వాళ్లు అక్కడకు వెళ్లారు’ అని చెప్పారు.
భరత్ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్ స్ట్రక్షన్ అయిన చనవీరప్ప కొడుకు మరణ వార్త తెలుసుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. తన కొడుకు ఇక లేడని విన్న తర్వాత.. భరత్ తల్లి తీవ్ర ఆనారోగ్యానికి గురైందని చెప్పాడు. ఆమె ప్రస్తుతం గుండె జబ్బుతో బాధపడుతోందని.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పాడు.
బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య.. భరత్ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘కాసేపటి క్రితమే భరత్ భార్య సుజాతతో మాట్లాడాను. ఆమె సురక్షితంగానే ఉంది. ఆమెకు మూడేళ్ల బాలుడు ఉన్నాడు. వీరిద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వారిని, ఇతర కుటుంబాలను వీలైనంత త్వరలో బెంగళూరుకు సురక్షితంగా తీసుకొస్తాం’ అని ఆయన చెప్పారు.
Also Read: BREAKING: కశ్మీర్ ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం..