Kashmir : కాశ్మీర్ లో ఓ జవాన్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. జావెద్ అహ్మద్ వని భారత్ ఆర్మీలో రైఫిల్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. ఆయన సెలవుపై కొన్నిరోజుల క్రితం కుల్గాం జిల్లాలోని అస్థాల్ గ్రామంలోని తన ఇంటికి వెళ్లారు. శనివారం రాత్రి జావెద్ కారులో చావల్గాం మార్కెట్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. జావెద్ కారు మాత్రం ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. కారులో రక్తపు మరకలను గుర్తించారు. దీంతో జావెద్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
జావెద్ మిస్సింగ్ సమాచారం తెలియగానే సైన్యం వెంటనే రంగంలోకి దిగింది. గాలింపు చర్యలు చేపట్టింది. జావెద్ కుటుంబ సభ్యలు తమ కుమారుడు కిడ్నాప్ అయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తమ కుమారుడిని విడుదల చేయాలని జావెద్ తల్లి కోరారు. మమ్మల్ని క్షమించాలని కిడ్నాపర్లను కోరారు. తమ కుమారుడిని తిరిగి సైన్యంలోకి వెళ్లనివ్వని చెప్పారు. జావెద్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
గతంలో ఇలానే సెలవుపై వెళ్లిన సైనికుడిపై ఉగ్రదాడులు జరిగాయి. 2018లో సైన్యంలోని 44 రాష్ట్రీయ రైఫిల్స్‌లో పని చేస్తున్న రైఫిల్ మ్యాన్ ఔరంగజేబు కూడా అప్పట్లో సెలవుపై ఇంటికి వెళ్లారు. అప్పుడు అతడిని హజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రైఫిల్ మ్యాన్ ఔరంగజేబును హత్య చేసిన ఉగ్రవాదులను సైన్యం ఆ తర్వాత హతమార్చింది. రైఫిల్ మ్యాన్ ఔరంగజేబుకు ప్రభుత్వం శౌర్యచక్రను కూడా బహూకరించింది.