Justice Yashwant Varma: దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు దొరికిన వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఇంట్లో దొరికిన నోట్ల కట్టలపై సరైన సమాధానం చెప్పడంలో విఫలమయ్యారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చిచెప్పింది. బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన ఈ విచారణ నివేదికలోని ముఖ్యాంశాలను ఓ జాతీయ మీడియా సంస్థ బయటపెట్టింది. ఈ కేసులో మాజీ న్యాయమూర్తిని కమిటీ దోషిగా నిర్ధారించినట్లు పేర్కొంది.
న్యూఢిల్లీలోని తుగ్లక్ క్రెసెంట్ వద్ద ఉన్న జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో 2025 మార్చి 14న అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి వచ్చిన ఫైర్‌ఫైటర్లు ఇంటిలోని ఒక స్టోర్‌రూమ్‌లో కాలిన స్థితిలో ఉన్న భారీ నగదును గుర్తించారు. అక్కడ పెద్ద ఎత్తున రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయితే ఆ నగదు ఎక్కడిది? దానికి యజమాని ఎవరనే విషయాలపై న్యాయమూర్తి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.
నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత జరిగిన దర్యాప్తు తీరుపై కూడా కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సరిగ్గా సంరక్షించలేదని పేర్కొంది. చట్టబద్ధంగా సీల్ చేసి తనిఖీలు చేయడానికి ముందే ఆ స్టోర్‌రూమ్ లో ఆధారాలను చెరిపేశారని.. ఆ తర్వాత అక్కడ ఉన్న నోట్ల కట్టలు మాయం కావడంపై ఇప్పటికీ స్పష్టత లేదని నివేదిక వెల్లడించింది. నివాసంలో ఉన్న సిబ్బందిని స్టోర్‌రూమ్‌లోకి అనుమతించడం వల్లే ఆధారాలు దెబ్బతిన్నాయని కమిటీ తప్పుబట్టింది. అయితే జస్టిస్ వర్మే స్వయంగా ఆ నగదును అక్కడ నుంచి తరలించారనడానికి ఆధారాలు లభించలేదని నివేదికలో పేర్కొన్నారు.
ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇచ్చిన వివరణలపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2025 మార్చి 22న ఆయన ఇచ్చిన లిఖితపూర్వక లేఖను కమిటీ పూర్తిగా తోసిపుచ్చింది. ఆయన ఇచ్చిన సమాధానంలో పారదర్శకత, ప్రామాణికత లోపించాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక కేసు విచారణకు సంబంధించి మౌఖిక, లిఖితపూర్వక ఆధారాలతో కూడిన నివేదికను కమిటీ వందలకొద్ది పేజీలతో పార్లమెంట్ ముందు ఉంచింది.
Also Read: రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చిందోచ్.. ఫీచర్లు చూస్తే పూనకాలే.. ధర కూడా తక్కువే!
ఇదిలా ఉంటే అప్పట్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. నగదు లభించిన స్టోర్ రూమ్‌పై జస్టిస్ వర్మకు పూర్తి నియంత్రణ ఉందన్న అభిప్రాయానికి కమిటీ వచ్చింది. అంతేకాకుండా ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్‌లో ఆయన తొలగింపు చర్యలు ప్రారంభించగా.. ఈ లోపే జస్టిస్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు.
Also Read: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. రైల్వే స్టేషన్‌లో పెళ్లి.. గంటల్లోనే విషాదాంతం!