Kejriwal BJP Loan Waiver| ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను (Assembly Elections) మొత్తం దేశానికి జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందని.. ఒకటేమో ప్రజాసంక్షేమంపై దృష్టి సారించగా, మరొకటి కొంతమంది సంపన్నులకు ప్రయోజనం చేకూర్చుతోందని వ్యాఖ్యానించారు. బిజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర సర్కారు గత ఐదేళ్లలో 400-500 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు.
‘‘పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎలా ఖర్చు చేయాలో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. బిజేపీ మోడల్ ప్రకారం రూ.వేల కోట్ల ప్రజా సొమ్మును ఆ పార్టీ తన సన్నిహితులకు రుణాలుగా ఇచ్చి.. ఆ తర్వాత మాఫీ చేస్తుంది. అదే ఆప్ మాత్రం.. సామాన్యులకు మేలు చేకూర్చేలా ఉచిత విద్యుత్, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలపై దృష్టిసారిస్తుంది. ఢిల్లీలోని ప్రతి ఇంటికి నెలకు దాదాపు రూ.25 వేల విలువైన ప్రయోజనాలు అందిస్తుంది’’ అని కేజ్రీవాల్ ఓ మీడియా సమావేశంలో తెలిపారు. ఒకవేళ బిజేపీ అధికారంలోకి వస్తే స్థానికంగా ఆప్ ప్రవేశపెట్టిన పథకాలను నిలిపివేస్తుందని ఆయన అన్నారు.
తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా బిజేపీ పేర్కొనడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. ఒకవైపు బడా వ్యాపారవర్గాలకు భారీ రాయితీలు ఇస్తూ.. మధ్యతరగతి ప్రజల్లో మాత్రం అపరాధ భావనను సృష్టించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. ‘‘ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్ వంటి పథకాలను నిలిపేస్తామని బిజేపీ ఇప్పటికే చెప్పింది. ఒకవేళ ఆ పార్టీ అధికారం పొందితే మీరు ఈ వ్యయాలను భరించగలరా?’’ అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న పోలింగ్ నిర్వహించనుండగా.. 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ జోరు.. ఓటర్ల మెప్పు కోసం కార్యకర్తలు, అగ్రనేతలందరూ రంగంలోకి
గుజరాత్ పోలీసుల భద్రతపై కేజ్రీవాల్ విమర్శలు
తన భద్రత నుంచి పంజాబ్ పోలీసులను తొలగించడం పూర్తిగా రాజకీయమేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత భద్రత విషయంలో రాజకీయాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించిన పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు పంజాబ్ పోలీసులను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “గుజరాత్ పోలీసుల ఆదేశాలను చదవండి. ఎన్నికల సంఘం పంజాబ్ పోలీసులను తొలగించి గుజరాత్ పోలీసులకు నా భద్రతా బాధ్యతల అప్పగించింది. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది?” అంటూ ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతలు పోలీసుల సమక్షంలోనే ప్రజలకు డబ్బులు పంచుతూ ఓట్లు కొంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. బహిరంగంగా డబ్బు, మద్యం, బంగారు గొలుసులు పంపిణీ చేస్తున్నారని శుక్రవారం ‘ఎక్స్’లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
“బీజేపీ నేతలు ఇస్తున్న డబ్బు తీసుకోండి. కానీ, మీ ఓటును అమ్ముకోవద్దు” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “వారు పంచుతున్న డబ్బంతా ప్రజల నుంచి లూటీ చేసి తెచ్చింది. ఇది ప్రజల సొమ్మే. వాస్తవానికి, అది మీ డబ్బే” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
‘‘సాధారణంగా పోలింగ్ కు ఒకరాత్రి ముందు నేతలు చక్రం తిప్పుతారు. కానీ, ఢిల్లీలో బీజేపీ నేతలు నెలన్నర రోజులుగా ప్రజలకు డబ్బు, మద్యం, గోల్డ్ చెయిన్లు, బూట్లు, దుప్పట్లు, రేషన్ సరుకులు పంచుతున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నది. పోలీసులు దగ్గరుండి బీజేపీ నేతలకు సహకరిస్తున్నారు.
ఎన్నికల సంఘం, చట్టాలపై ఎవరికీ భయం లేదు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. బీజేపీ నేతలకు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తున్నది? దేశ ప్రజలను బిజేపీ నేతలు లూటీచేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ డబ్బునే వారు ఓటర్లకు తిరిగి పంచుతున్నారు’’ అని కేజ్రీవాల్ బిజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఓటును అమ్ముకోరాదని, ఓటు వెలకట్టలేనిదన్నారు. మనకు అంత సులభంగా ఓటుహక్కు రాలేదని, అందుకోసం రాజ్యాంగ నిపుణులు ఎంతో కష్టపడ్డారని ఆయన చెప్పారు.