Kerala Chief Secretary : ఎంతో కష్టపడి సివిల్స్ సాధించిన ఘనత.. నిరంతరం కష్టపడి ఎన్నో ప్రశంసలు దక్కించుకున్న పనితనం. అంతే కాదు… ఆమె ఓ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా శక్తివంతమైన పోస్టులో ఉన్నారు. అయితేనేం.. ఆమె ఇప్పటికీ తన రంగు గురించి ఆలోచించేలా, బాగోలేదా అని మథనపడే పరిస్థితులున్నాయంటే.. మనం ఎంత వెనుకపడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. తన రంగు గురించి తన దృష్టికి వచ్చిన కామెంట్లపై ఆ మహిళా ప్రధాన కార్యదర్శి స్పందించాలనుకున్నారు.. సోషల్ మీడియా ద్వారా శక్తివంతమైన పోస్టు పెట్టారు. ఆ పోస్టు ఇప్పుడు… అలాంటి వివక్షలు ఎదుర్కొంటున్న ఎంతో మంది తరఫున, అలాంటి ఆలోచనలున్న వారికి ఎక్కుపెడుతున్న బాణంలా, వారి బుద్ధికి బుద్ధి చెబుతున్నట్లుగా ఉండండంతో.. వైరల్ గా మారింది.
కేరళ ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు.. ఎంతో ఆలోచనాత్మకంగా, ప్రతీ ఒక్కరు వారి ఆలోచనల్లో తెచ్చుకోవాల్సిన మార్పులకు చక్కటి ఉదాహరణగా ఉంది. శారద మురళీధరన్ కొన్ని నెలల క్రితమే ప్రధాన కార్యదర్శి పోస్టులో నియమితులైయ్యారు. అంతకు ముందు ఆ పోస్టులో ఆమె భర్త వేణు ఉన్నారు. తాను ఆఫీస్ కు వచ్చాక.. తన భర్త రంగుతో ముడిపెట్టి ఆమెపై కామెంట్లు చేశారంట.. ఆ విషయం తెలియడంతో
“నా నల్లదనాన్ని నేను సొంతం చేసుకోవాలి” అంటూ ఓ పోస్టు చేశారు. కొంతసేపటికి ఆమె ఆ పోస్ట్ తొలగించారు. కానీ.. తన సహచరుల సూచనతో తిరిగి పోస్టు చేశారు.
“గత 50 ఏళ్లకు పైగా తాను మంచి రంగులో లేను అనే మాటలు వింటూనే ఉన్నాను. ఈ విషయంలో నేను బాధపడ్డాను. నల్లగా ముద్ర వేయడం వల్ల నేను నా పూర్వీకులతో పోల్చి చూసుకుంటున్నాను, నేను చాలా బాధపడ్డాను. కానీ.. తెలిసింది ఏంటంటే అలా ఆలోచించడం సిగ్గుపడాల్సిన విషయం. నలుపును రంగుగా మాత్రమే చూడడం లేదు. నలుపు మంచి చేయనిది, నలుపు అనారోగ్యం, కఠినమైన నిరంకుశత్వం, చీకటి హృదయానికి ఈ నలుపు సంకేతం”.
“కానీ నలుపును ఎందుకు దూషించాలి? నలుపు అనేది విశ్వంలో సర్వవ్యాప్త సత్యం. నలుపు అనేది దేనినైనా గ్రహించగలదు, మానవాళికి తెలిసిన అత్యంత శక్తివంతమైన శక్తి పల్స్. ఇది ప్రతి ఒక్కరిపై పనిచేసే రంగు, ఆఫీసు కోసం దుస్తుల కోడ్, సాయంత్రం పార్టీలకు సిద్ధమయ్యే వారి ఎంపిక, కళ్లకు అందాన్ని తెచ్చే కాజోల్ మెరుపు, వర్షం చేసే వాగ్దానానికి గుర్తు” అని ఆమె తన పోస్టులో రాశారు.
చిన్నప్పటి నుంచి తాను వర్ణ వివక్ష ఎదుర్కొంటున్నానని తెలిపిన ఈమె.. నాలుగేళ్ల వయస్సులోనే.. తన తల్లిని తిరిగి బొజ్జలోకి తీసుకెళి, మళ్లీ తెల్లగా, అందంగా కనగలవా అని అడిగిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. నలుపు రంగులో అందాన్ని, విలువను చూడకపోవడం. తెల్లటి చర్మం పట్ల ఆకర్షితులవడం సమాజంలోనే ఉందని అన్నారు. తెల్లటి మనస్సులు, తెలుపు మంచికి గుర్తుగా ఉండడం, ఆరోగ్యకరమైనదని చెప్పడం.. వంటి వాటితో తాను అలా లేనందుకు తనకు తానే చాలా తక్కువ వ్యక్తిని అని భావించేదానిని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Crude Oil UP : దేశంలో భారీగా ముడి చమురు నిల్వలు గుర్తింపు – భారత్ ఇక సూపర్ శక్తి?
కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసిన ఈ పోస్టుకు అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు VD సతీశన్ కూడా ఉన్నారు. మీరు రాసిన ప్రతి పదం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఇది చర్చించదగిన అంశమని, నాకు కూడా నల్లటి చర్మం ఉన్న తల్లి ఉంది అంటూ వ్యాఖ్యానించారు.