Saptagiri: కమెడియన్ నుండి హీరోగా మారిన సప్తగిరి తాజాగా ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా పెను ప్రమాదానికి కూడా గురయ్యేలా చేశాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ జరగలేదు కానీ ఈ విషయం అంతటా వైరల్ అవుతుండడంతో తనను ప్రజలంతా తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సప్తగిరి.. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు. తనకు తోడుగా టీడీపీ నాయకుడు ఆర్వీటి బాబు కూడా యాడ్ అయ్యాడు. అయితే వీరిద్దరూ అందరిలాగా మామూలుగా దర్శనం చేసుకోకుండా హెలికాప్టర్ నుండి దేవాలయంపై పువ్వులు చల్లాలని అనుకున్నారు.
అత్యుత్సాహం వల్లే
ఆర్వీటీ బాబు, సప్తగిరి కలిసి దేవాయంపై హెలికాప్టర్‌పై నుండి పూలు జల్లే ప్రయత్నంలో పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ నుండి వచ్చే వేగమైన గాలి వల్ల గుడి ముందు ఏర్పాటు చేసిన షామియానాలు కూలిపోయాయి. అంతే కాకుండా దాని నుండి వచ్చిన దుమ్ము వల్ల చాలామంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు కూడా పడ్డారు. ఈ విషయం బయటికి రావడంతో సప్తగిరిపై ప్రజలు మండిపడుతున్నారు. ఆలయాన్ని సందర్శించుకోవాలంటే ఇది మార్గం కాదని విమర్శిస్తున్నారు. సుగుటూరు గంగమ్మ జాతర అనేది ఫేమస్ జాతర కావడంతో దానిని చూడడానికి చాలామంది భక్తులు తరలివచ్చారు. కానీ సప్తగిరి చూపించిన అత్యుత్సాహం వల్ల అందరూ ఇబ్బందులు పడ్డారు.
భక్తుల ఆగ్రహం
హెలికాప్టర్ నుండి వచ్చే వేగమైన గాలి వల్ల షామియానాలు కూలిపోయాయి కానీ అదే సమయంలో వాటి కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ వాటి కింద ఎవరైనా చిక్కుకొని ఉండుంటే సప్తగిరి మరింత పెద్ద సమస్యల్లో పడేవాడు. దీంతో సప్తగిరిపై భక్తులు మాత్రమే కాదు.. అక్కడి పోలీసులు, ప్రభుత్వాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిలో ఇలాంటి పనులు అసలు అవసరం లేదని, ఇవన్నీ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులను ప్రమాదంలో పడేసే చర్యలు అంటూ పోలీసులు సప్తగిరిని నిలదీశారు. తను చేసిన పని వల్ల కాసేపటి వరకు భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని భక్తులు కోరారు.
Also Read: ‘రాబిన్‌హుడ్’ రికార్డ్ బిజినెస్.. నితిన్ ముందు భారీ టార్గెట్!
ప్రమోషన్స్ కోసమేనా.?
సినిమా ప్రమోషన్స్ కోసం ఈమధ్య దర్శక నిర్మాతలు, నటీనటులు ఎంత దూరం అయినా వెళ్తున్నారు. అందులో భాగంగానే తన లేటెస్ట్ మూవీ అయిన ‘పెళ్లి కాని ప్రసాద్’ను ప్రమోట్ చేయడం కోసం సప్తగిరి ఈ పని చేసుండవచ్చని తెలుస్తోంది. ముందుగా కమెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు సప్తగిరి. కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథా చిత్రమ్’తో తనకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. కమెడియన్‌గా మంచి ఫేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సప్తగిరి (Saptagiri). అయినా ఇప్పటివరకు హీరోగా తనకు సరైన హిట్ పడలేదు.