Kerala hospital accident: కేరళలోని కొట్టాయం జిల్లాలో ఓ బాధాకర ఘటన చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని పాత భవనం కూలిపోయి ఒక మహిళ మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన రోగులు, సిబ్బంది అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. ప్రమాద సమయంలో ఆ భవనం సమీపంలోని 14వ వార్డులో రోగులు ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. హఠాత్తుగా శబ్దం విన్న ఆసుపత్రి సిబ్బంది తక్షణమే అప్రమత్తమై, దాదాపు వంద మంది రోగులను ఇతర వార్డులకు తరలించారు. ఈ ముందు జాగ్రత్త వల్లే మరిన్ని ప్రాణనష్టాలు తప్పాయని చెబుతున్నారు. అయినప్పటికీ, ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉండవచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగించారు. అధికారులు ప్రత్యేకంగా భవనం శిథిలాల మధ్య పరిశీలనలు చేయిస్తున్నారు.
కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఘటన జరగడం తీవ్ర భాదకరమని, బాధితులకు అవసరమైన అన్ని సాయాలు అందిస్తామన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక కోరినట్లు తెలిపారు.
అధికారుల ప్రకటన ఆధారంగా.. కూలిన భవనం వాడుకలో లేదని చెబుతున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బందిలో కొంతమంది మాత్రం ఆ భవనానికి ఆనుకుని ఉన్న టాయిలెట్లను ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందే రోగులు ఉపయోగించారని చెప్పారు. దీనితో అక్కడి భద్రతాపరమైన చర్యలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవనం వాడుకలో లేకపోయినా, ఇంత సమీపంలో రోగులు ఉండగా ఏం చర్యలు తీసుకున్నారన్నది ఇప్పుడు చర్చకు మారింది.
Also Read: Hyderabad electric buses: హైదరాబాద్ కు అన్ని బస్సులా? ఇకపై మెట్రో పరిస్థితి ఏంటో?
ఈ సంఘటనతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కుటుంబ సభ్యులు, సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. ఇక్కడి పాత భవనాల పరిస్థితి ఎప్పటికీ మారదా?, ప్రాణాలు పోయాకే అధికారులకి స్పూర్తి వస్తుందా? అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ప్రభుత్వం ఘటనపై ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఆసుపత్రుల్లో ఉన్న పాత భవనాల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో శిథిల భవనాలు ఉండటమే కాకుండా, వాటి పక్కనే రోగులను ఉంచడం ఇప్పుడు అందరికీ ఆందోళనకరంగా మారింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పాత భవనం కూలిపోవడం వల్ల రోగులు, వారి కుటుంబసభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. అధికార యంత్రాంగం స్పందించినా, ఇది ముందే ఊహించాల్సిన ప్రమాదమని ప్రజల ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. శాసనసభా స్థాయిలో దీనిపై చర్చ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ప్రదేశాల్లో పాత భవనాలను ఉపయోగంలోకి తేవడాన్ని పూర్తిగా అరికట్టాలి.