Strange Ritual: ఎవరితో అయినా ఎక్కువ పనిచేయిస్తూ ఉంటే అది గొడ్డు చాకిరి అంటూ ఉంటాం.. అంటే పశువులు అంతగా కష్టపడతాయని దాని అర్దం. మరి అలాంటి పశువులను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అదే చేస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. పండించే పంట కోసం ఆరుగాలం శ్రమించే అన్నదాతకు.. అన్ని విధాల అండదండలు అందించే పశువులను పరమేశ్వరుని వాహనంగా భావించి సోమవారం పశువులకు సెలవు ఇస్తారు. అలాంటి విశిష్ట సంప్రదాయాన్ని పాటిస్తున్న గ్రామం కర్నూలు జిల్లాలోని విరుపాపురం. ఇక్కడ జరుగుతున్న ఈ వింత ఆచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేవుని వాహనానికి గౌరవం
ఈ ఆచారం మరో విశ్వాసానికి కూడా నిలువెత్తు నిదర్శనం. హిందూ పురాణాల ప్రకారం నంది అంటే పరమేశ్వరుని వాహనం. అదే విధంగా, ఎద్దును పూజించటాన్ని భక్తిరసంతో చూస్తారు. పశుపతినాధుడిగా ప్రసిద్ధుడైన శివుడు పశువులకే అధిపతి. కాబట్టి నందినిగా భావించే పశువులకు సోమవారం విశ్రాంతిని ఇవ్వడం.. శివునికి సెలవు ఇచ్చినట్లే భావిస్తారు. గ్రామ పరిశర ప్రాంతంలో ఉన్న పాలకొండ సమీపంలో ఆపరమశివుడు పాలకొండేశళ్వరునిగా స్వయంగా వెలిశారని స్థానికులు చెబుతుంటారు.
ఆదరణ, జాగ్రత్తలకు నిలువెత్తు ఉదాహరణ
పశువుల రక్షణ అంటే కేవలం వాటికి మేత పెట్టడమే కాదు. వాటిని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడమే నిజమైన సేవ. విరుపాపురం ప్రజలు ఇదే చేస్తున్నారని చెప్పొచ్చు. సోమవారం వచ్చిందంటే ఆగ్రామం అంతా సందడి వాతావరణం నెలకొంటుంది. కులమతాలకు అతీతంగా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ముగ్గులు వేస్తారు. మగవారు అందరూ వారం రోజుల పాటు.. అలుపెరగకుండా తమ వెంట నడిచిన బసవన్నను.. గ్రామ పరిశరాల వద్ద ఉన్న చెరువు దగ్గరకు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయిస్తారు. ఆరోగ్యం కోసం ఈత కొట్టించి ఇంటికి తీసుకుని వస్తారు. పొలంలోకి వాటిని దింపరు ఆ రోజు తమ పశువులను మాత్రం దైవంతో సమానంగా చూసుకుంటారు.
ఇతర గ్రామాలకు స్ఫూర్తి కావలసిన పద్ధతి
ఈ ఆచారం విని మొదట్లో కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న తత్వం, జ్ఞానం తెలిసిన తరువాత మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. ఇది కేవలం పశువుల పరిరక్షణకే కాదు, రైతు–ప్రకృతి సంబంధాన్ని బలోపేతం చేసే ఓ నూతన దృక్పథం కూడా.
Also Read: అందగాడివి.. ఇలా అయిపోయావేంటీ? జగన్‌ను కలసిన వంశీ
సంస్కృతి, సహజ జీవనానికి నిదర్శనం
విరుపాపురం పాటిస్తున్న ఈ పద్ధతి మన గ్రామీణ సంస్కృతిలో పశుపోషణకు ఉన్న ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ ఆదర్శాన్ని ఇతర గ్రామాలు కూడా పాటిస్తే.. పశువుల ఆరోగ్యం మెరుగవుతుంది, రైతు అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.