BJP MLA IT Raid Crocodiles| బిజేపీ నాయకుడు, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఆదాయ పన్ను విభాగం అధికారులు సోదా చేయడానికి వెళితే.. అక్కడ వారు మొసళ్లు చూసి భయపడిపోయారు. ఆ నాయకుడి ఇంట్లో కిలోల లెక్కన బంగారం, భారీగా నల్లధనం లభించింది. ఇదంతా మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు హర్‌వంశ్ సింగ్ రథోడ్. ఆయన జిల్లాలోని బుందా నియోజకవర్గం 2013 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. 2018 వరకు కొనసాగారు. అయితే 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడంతో 2023 ఎన్నికల్లో బిజేపీ ఆయనకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన పార్టీ సీనియర్ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. గతంలో హర్‌వంశ్ సింగ్ రథోడ్ రెండు సార్లు సాగర్ జిల్లా పంచాయత్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఆయన తండ్రి హర్నామ్ సింగ్ రాథోడ్ కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
హర్‌వంశ్ సింగ్ రథోడ్ ఒక బడా వ్యాపారి
హర్‌వంశ్ సింగ్ రథోడ్ వంశపారంపర్యంగా బీడి, మద్యం వ్యాపారం చేస్తున్నారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ బిజినెస్ లో వందల రూ. కోట్లు సంపాదించారు. ఆయన కుటుంబంలో అందరికీ అడవిలో వేటాడే అలవాటు ఉందని స్థానిక మీడియా తెలిపింది.
Also Read: శంభు బార్డర్ వద్ద రైతుల నిరసనల్లో అన్నదాత ఆత్మహత్య.. మూడు వారాల్లో రెండో ఘటన
ఆదాయపన్ను సోదాల్లో 14 కిలోల బంగారం, భారీ మొత్తంలో నగదు
ఆదాయపన్ను అధికారులు ఆదివారం హర్‌వంశ్ సింగ్ రథోడ్ ఇంట్లో సోదాలు చేశారు. ఆ సమయంలో ఇంట్లో నుంచి 14 కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆయన మొత్తం రూ.144 కోట్ల పన్నులు చెల్లించకుండా ఎగవేశారనే ఆరోపణలున్నాయి. బంగారంతో పాటు రూ.3 కోట్లు నగదు, ఏడు లగ్జరీ కార్లు, పలు రియల్ ఎస్టేట్ ఆస్తుల పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన బిజినెస్ పార్ట్‌నర్ రాజేష్ కేశర్వానీ ఇంట్లో కూడా భారీగా నగదు, కార్లు లభించాయి. కానీ ఈ కార్లు వివిధ వ్యక్తుల పేర్ల మీద ఉన్నాయి. దీంతో అధికారుల కార్ల గురించి ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ కు సమాచారం అందించారు.
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మొసళ్లు.
ఆదాయపన్ను మాజీ బిజేపీ ఎమ్మెల్యే హర్‌వంశ్ సింగ్ రథోడ్ సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ వారికి మూడు పెద్ద మొసళ్లు కనిపించాయి. ఇంట్లో వారి కోసం ప్రత్యేకంగా పూల్ కూడా నిర్మించారు. అంతే కాదు ఆయన ఇంట్లో జింక, పులి చర్మాలు కూడా లభించాయి. హర్‌వంశ్ సింగ్ రథోడ్, ఆయన కుటుంబ సభ్యులు అడవిలో తరుచూ వేటాడడానికి వెళ్తుండడంతో వారే అడవి మృగాలను చంపి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.