KumbhMela Family Earning| ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. అయితే.. కుంభమేళా నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టిగా సమాధానం ఇచ్చారు. కుంభమేళా వల్ల చాలా మంది ఆర్థికంగా లాభపడ్డారని ఆయన తెలిపారు. పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఎలాంటి ఆదాయం రాలేదని.. సమాజ్‌వాదీ పార్టీ చేసిన విమర్శలకు సిఎం చెక్ పెట్టారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం యోగి ఈ అంశంపై స్పందించారు. కుంభమేళాలో ఒక కుటుంబం 130 పడవలు నడిపించి.. ఏకంగా దాదాపు రూ.30 కోట్లు ఆర్జించిందని ఆయన తెలిపారు.
సీఎం యోగి మాట్లాడుతూ.. “కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లతో 45 రోజులపాటు జరిగిన సనాతన ఆధ్యాత్మిక వైభవం మహాకుంభమేళా. ప్రయాగ్రాజ్‌లో ఒక కుటుంబం విజయగాథ చెప్పింది. ఆ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. 45 రోజుల కుంభమేళా రోజుల్లో ఈ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల లాభాలను ఆర్జించింది. అంటే ఒక్కో పడవ రూ.23 లక్షల లాభం తెచ్చింది. రోజుల లెక్కన చూస్తే, ఒక్కో పడవ నుంచి రోజుకు రూ.50,000 నుంచి రూ.52,000 లాభం వచ్చింది” అని వివరించారు.
ఈ మహా కుంభమేళాకు దేశ-విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా కుంభమేళా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.
Also Read: ప్రభుత్వాల వైఫ్యలంతోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ.. మండిపడిన సుప్రీం!
కుంభమేళా వివరాలను యోగి వెల్లడిస్తూ, “ఒక్క తొక్కిసలాట ఘటన తప్ప, 45 రోజుల్లో ఏకంగా 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా మేళాకు వచ్చి వెళ్లారు. ఒక్క నేరం జరగలేదు. కిడ్నాప్, దోపిడీ, మహిళలపై వేధింపులు, హత్య లాంటి ఘటన ఒక్కటి కూడా జరగలేదు” అని అన్నారు.
కుంభమేళా ఆర్థిక ప్రభావం:
వేల కోట్లలో ఖర్చు చేస్తే లక్షల కోట్లలో ఆదాయం వచ్చిందని ముఖ్యమత్రి ఆదిత్యనాథ్ వెల్లడించారు. కుంభమేళా కోసం చేసిన ఏర్పాట్లు, భద్రత తదితరాలకు మొత్తం ఖర్చు రూ.7,500 కోట్లు అయింది. 200కు పైగా రోడ్లను వెడల్పు చేశాం. 14 ఫ్లైఓవర్లు కట్టాం. 9 అండర్‌పాస్‌లు నిర్మించాం. 12 కారిడార్లను సిద్ధం చేశాం. దీంతో పలు రంగాల్లో మొత్తంగా రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.
ఈ ఏడాది దేశ స్థూల జాతీయోత్పత్తికి (GDP) కుంభమేళా కూడా తన వంతు వాటాను అందించిందని యోగి తెలిపారు. ఈ ఏడాది దేశ GDP 6.5% వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరిగింది.