Supreme Court Affordable Medicines | ప్రైవేట్ ఆస్పత్రుల ఖర్చులు భరించలేని సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా వైద్యం రాను రాను సామాన్యలకు అందుబాటులోకి లేకుండా పోతోందని.. అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే.. ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రోత్సాహకాలు మారాయని.. అత్యున్నత కోర్టు వ్యాఖ్యానించింది.
రోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులు కొనుగోలు చేయించడం ద్వారా దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేసింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.కే. సింగ్, జస్టిస్ సూర్యకాంత్ ల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో.. “మేము మీ ఆందోళనతో ఏకీభవిస్తున్నాము, కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? దీన్ని ఎలా నియంత్రించాలి?” అని పిటీషన్ వేసిన లాయర్ ను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. తమ ఫార్మసీల నుండే మందులు కొనుగోలు చేయమని రోగులను ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.
ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. ఈ కారణంగా పేద వర్గానికి చెందిన రోగులు దోపిడీకి గురవుతున్నారని పిటిషనర్ తెలిపారు. సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ వాదనతో ఏకీభవించింది.
Also Read: అసెంబ్లీలోనే పాన్ మసాలా ఉమ్మేసిన ఎమ్మెల్యే – స్పీకర్ వార్నింగ్ హైలెట్
రోగులకు సూచించిన మందులు బయట తక్కువ ధరకు లభిస్తున్నప్పుడు, వాటిని తమ ఫార్మసీల నుండే కొనుగోలు చేయమని ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ధర్మాసనం సూచించింది. ముఖ్యంగా.. సమాజంలోని పేద వర్గాలకు ప్రాణాధార మందులు అందుబాటు ధరల్లో లభించడం కష్టమైపోయిందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. పౌరులు ఈ అధిక ధరల మందుల దోపిడికి గురికాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది.
ఇదే విషయంపై గతంలో అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ప్రతిస్పందనగా.. ఆ రాష్ట్రాలు కౌంటర్ అఫిడవిట్లను కూడా దాఖలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ధరల నియంత్రణ ఆదేశాల ప్రకారమే తాము మందుల ధరలు నిర్ధారిస్తున్నామని అత్యవసర మందులు కూడా అందుబాటు ధరల్లో లభ్యమయ్యేలా చూస్తున్నామని రాష్ట్రాలు తమ అఫిడవిట్ లో పేర్కొన్నాయి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా.. ఆస్పత్రుల ఫార్మసీల నుంచే మందులు కొనుగోలు చేయాలని రోగులపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పింది.
ఈ సమస్యే కాకుండా ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో ల్యాబ్ పరీక్షలు, ఓపీ, వైద్య పరీక్షల ధరలు కూడా మండిపోతున్నాయి. సాధారణ రోగులు వెళ్లితే జేబులు ఖాళీ అవ్వాల్సిందే. చాలామంది ఈ కారణంగా ఆస్పత్రులకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఔషధాలతో పాటు డయాగ్నస్టిక్ వైద్య పరీక్షల ఫీజులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని.. ధరలు నియంత్రణకు చర్యలు తీసుకురావాలని సామాన్యులు కోరుతున్నారు.