Kunal Kamra Sudha Murthy| స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా(Kunal Kamra)కి మద్రాస్ హైకోర్టు(Madras Highcourt) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde)పై ఇటీవల కుణాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అతనిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఏప్రిల్ 7వరకు హై కోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కుణాల్ తన షోలో ప్రత్యేకంగా ఎవరినీ ప్రస్తావించలేదని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఈ కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ కుణాల్ తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
ఏంటి వివాదం?
ఇటీవల ముంబయిలో కుణాల్ కామ్రా ఓ స్టాండప్ కామెడీ కార్యక్రమం నిర్వహించాడు. ఇందులో ఏక్‌నాథ్ శిందేపై ఓ పేరడీ పాటను ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు దాడి చేసి కార్యక్రమం వేదికను ధ్వంసం చేశారు. దీనిపై ఇటీవల స్పందించిన ఏక్‌నాథ్ శిందే.. కామ్రా ఎవరి వద్దనో సుపారీ (డబ్బులు) తీసుకొని ఒక వ్యక్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నాయన్నారు. వాక్ స్వాతంత్ర్యానికి, వ్యంగ్యానికీ ఓ హద్దు ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: భార్య అలా చేస్తే డైరెక్ట్ విడాకులే.. హై కోర్టు సంచలన తీర్పు
సుధామూర్తి సింప్లిసిటీపై కుణాల్ కామ్రా సెటైర్లు..
ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde)పై వివాదాస్పదమైన వ్యాఖ్యల కేసు జరుగుతుండగానే.. తాజాగా కున్నా కామ్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘నయా భారత్’ పేరిట ఇటీవల జరిగిన ఓ షోలో పలువురు సెలబ్రిటీలను ఉద్దేశించి కునాల్ కామ్రా (Kunal Kamra) ఇదే తరహాలో సెటైర్లు వేస్తూ కామెడీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి వంటి వారిపైనా ఆయన విమర్శలు చేశాడు. సుధామూర్తి (Sudha Murthy) సింప్లిసిటీని ప్రశ్నించాడు.
‘‘మధ్యతరగతి వారిగా నటించే ధనవంతుల్లో సుధామూర్తి ఒకరు. నిరాడంబరతకు తానే నిదర్శనమని ఆమె చెబుతారు. దానిపై ఆమె 50 పుస్తకాలు కూడా రాశారు. ఏ ఎయిర్‌పోర్టుకు వెళ్లినా ఆమె పుస్తకాలు దర్శనమిస్తాయి’’ అని కామ్రా అన్నారు. ఈసందర్భంగా సుధామూర్తిని విమర్శించేలా ఓ కల్పిత కథను చెప్పారు. ‘‘ఒకసారి నేను మామిడిపండ్లు అమ్ముతున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళాను. అతడు నాకు ఎనిమిది పండ్లను రూ.100కు ఇచ్చాడు. నేను అక్కడే ఉండగా.. కార్పొరేట్ దుస్తుల్లో ఉన్న ఒక మహిళ (సుధామూర్తిని ఉద్దేశించి) వచ్చారు. అవే పండ్లకు ఆ విక్రేత ఆమె వద్ద రూ.150 వసూలు చేశారు. నాకు తక్కువకు ఇచ్చి, ఆమె వద్ద ఎక్కువ ధర ఎందుకు తీసుకున్నావని నేను అడిగాను. దానికి అతను సమాధానమిస్తూ.. ఆ మోడ్రన్ డ్రెస్సులో వచ్చిన మహిళ ఇన్ఫోసిస్ అనే పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తోంది.. అందుకే ఆమెకు ఎక్కువ ధర చెప్పాను అని చెప్పాడు’’ అంటూ సుధా మూర్తిని ఉద్దేశించి మిమిక్రీ చేశాడు.
‘‘నారాయణమూర్తి వారంలో 70 గంటలు ఎందుకు పని చేయాలనుకుంటున్నారో ఇప్పుడు అర్థమైందా..? నేను సింపుల్.. నేను సింపుల్ అంటూ ఆమె ఆయనకు పదేపదే చెప్పడం వల్లే నారాయణమూర్తి పని గంటలపై వ్యాఖ్యలు చేసి ఉంటారు. బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి అయిన రిషి సునాక్‌కు ఆమె అత్త. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ. ఇదేం నిరాడంబరత..?’’ అని వారి లైఫ్‌స్టైల్ గురించి కామెంట్లు చేశాడు.
ఆనంద్ మహీంద్రానూ వదల్లేదు
అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే అంశాలతో పాటు ఆకట్టుకునే విషయాలను షేర్ చేసే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాపై కూడా కామ్రా వ్యంగాస్త్రాలు సంధించాడు. ఆయన తన సొంత కార్లను ఎలా మెరుగుపర్చుకోవాలో తప్ప.. అన్నింటిపైనా మాట్లాడుతుంటారని కామ్రా విమర్శించాడు. అలాగే మహీంద్రా ఆశావహ దృక్ఫథంపై సెటైర్ వేశాడు. ముంబయిలో వరదలు వచ్చిన సమయంలో ఒక డబుల్ డెక్కర్ బస్సుపై చిన్నారులు ఆడుకుంటున్న వీడియోను ఆయన షేర్ చేశారంటూ కామెంట్ చేశాడు.