Maha Kumbhmela Transport | మరికొద్ది రోజుల్లో మహా కుంభమేళా ప్రారంభం కానుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ఈ ఆధ్యాత్మిక సంరంభం కొనసాగనుంది. కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగరాజ్‌కు చేరుకునే కోట్ల కొద్దీ భక్తులకు అన్ని సౌకర్యాలు కలుగ జేసేందుకు యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. హిందూ సమాజంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాకుంభమేళాకు ఈసారి 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఓ అంచనా. వారికి ఏ అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కలిపించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి,
రవాణా సౌకర్యాలు సర్వం సిద్ధం
దేశనలుమూలల నుంచి భక్తులను ప్రయాగ్‌రాజ్ తరలించేందుకు అన్ని రకాల రవాణా సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. యూపీ ఆర్‌టీసీ (ఉత్తర్ ప్రదేశ్ ఆర్టీసి) తో పాటు భారతీయ రైల్వే, వివిధ ఎయిర్‌లైన్స్ సంస్థలు మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకు సేవలు అందించడానికి రెడీ అయ్యాయి.
కుంభమేళా కోసం యూపీఆర్టీసీ 7550 బస్సులను నడపనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బస్సులను ఏర్పాటు చేసింది. ఇక నగరం సరిహద్దుల నుంచి మేళా వేదిక వద్దకు తరలించేందుకు 550 కొత్త షటిల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. పొరుగున్న ఉన్న ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఆర్‌టీసీ బస్సులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మొత్తం మూడో కోట్ల మంది భక్తులు ఆర్టీసీ ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు సుమారు 8 లక్షల మంది బస్సుల ద్వారా చేరుకోనున్నారు.
ఇక రైల్వే కూడా మహా కుంభమేళా కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 13 వేల ప్రత్యేక రైలు సర్వీసులను సిద్ధం చేసింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఇప్పటికే రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దీనికి అదనంగా మరో 50 నగరాల నుంచి రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు.
ఎయిర్‌లైన్స్ కూడా రెడీ..
భక్తులను ప్రయాగ్‌రాజ్ చేర్చేందుకు ఎయిర్‌లైన్స్ కూడా సిద్ధమయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, బిలాస్‌పూర్, హైదరాబాద్, రాయ్‌పూర్, లక్నో, భుబనేశ్వర్, కోల్‌కతా, డెహ్రాడూన్, చండీఘడ్ నుంచి నేరుగా ప్రయాగ్‌రాజ్‌కు ఫ్లైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా జమ్మూ, చెన్నై, పట్నా, నాగ్‌పూర్, అయోధ్య, పూణె, భోపాల్ నుంచి కూడా ప్లైట్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. సంగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల దూరంలో ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టు ఉంది. ఇక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సులో సంగమ్ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ బస్సుల్లో టిక్కెట్టు ధర కేవలం రూ.35. ట్యాక్సీలు, క్యాబుల వంటివన్నీ రూ.వెయ్యి లోపే అందుబాటులో ఉన్నాయి.
ఈసారి కుంభమేళా ఎప్పటికి గుర్తుండిపోయేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు.