Maharashtra Contractors Protest | మహారాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన రూ.లక్ష కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని లేకపోతే నిరసనలు చేపడతామని ఆ రాష్ట్ర కాంట్రాక్టర్లు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (MSCA) ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తూ ఒక అల్టిమేటం జారీ చేసింది.
జూలై 2024 నుండి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) నుండి చెల్లించని బిల్లులు దాదాపు రూ. 46,000 కోట్లకు చేరాయని MSCA అధ్యక్షుడు మిలింద్ భోస్లే తెలిపారు. దీని కారణంగా 4 లక్షల కాంట్రాక్టర్లు మరియు 4 లక్షల కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. “మా ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, ప్రభుత్వం ప్రచారం కోసం ఉచితాలపై దృష్టి పెట్టింది” అని భోస్లే ఆరోపించారు.
ముంబై సర్కిల్ లోని మూడు డివిజన్లలో రూ.600 కోట్ల బిల్లులు చెల్లించలేదని ముంబై కాంట్రాక్టర్స్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాదా ఇంగలే తెలిపారు. చాలా మంది చిన్న కాంట్రాక్టర్లు మరియు నిరుద్యోగ యువత అభివృద్ధి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు. అయితే, చెల్లింపులు ఆలస్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.
వివిధ శాఖల వద్ద మొత్తం రూ.1,09,300 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సంఘం తెలిపింది. కాంట్రాక్టర్స్ సంఘం ప్రకారం.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (రూ. 46,000 కోట్లు), జల్ జీవన్ మిషన్ (రూ. 18,000 కోట్లు), గ్రామీణాభివృద్ధి (రూ. 8,600 కోట్లు), నీటిపారుదల శాఖ (రూ. 19,700 కోట్లు), పట్టణాభివృద్ధికి రూ.17,000 కోట్లు చెల్లించాల్సి ఉంది.
Also Read: యమునా నది నీటిని ఎన్నికల కమిషనర్ ప్రెస్‌మీట్‌లో తాగాలి.. ఈసీకి కేజ్రీవాల్ సవాల్!
ప్రభుత్వం హామీ
కాంట్రాక్టర్ల ఆగ్రహంపై గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ మీడియాతో మాట్లాడారు. నిధుల పంపిణీ ఆలస్యానికి కారణం ఉందనీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి సందర్భంగా చెల్లింపులు చేయడంలో జాప్యం జరిగిందని.. అంతే తప్పు చెల్లింపులు జరగలేదనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. వచ్చే బడ్జెట్ సెషన్ లో నిధుల్ని విడుదల చేస్తామన్నారు. విడతల వారీగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని పబ్లిక్ వర్క్స్ మంత్రి శివేంద్ర రాజే భోస్లే హామీ ఇచ్చారు.
ముంబై నగరంలో పెట్రోల్, డీజిల్‌పై నిషేధం
ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరిగిపోతుండడంతో పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏడు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం పరిధిలో థానె, రాయ్ గడ్, పాల్ఘర్ జిల్లాలు ఉన్నాయి.
ఈ కమిటీకి సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వం వహించగా.. ముంబై నగర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్), మహానగర్ గ్యాస్ మేనేజింగ్ డైరెక్టర్, మహారాష్ట్ర స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ (మహావితరణ్), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అధ్యక్షుడు, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్-1) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీని జనవరి 22న ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్ నిషేధంపై అధ్యయనం చేసి.. పర్యావరణ సమస్యలు, నిషేధ ప్రభావం గురించిన వివరాలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.