COVID variant 2025: స్వల్ప విరామం తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ దేశాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు తిరిగి నమోదవుతూ, ప్రజలలో ఆందోళనకు కారణమవుతున్నాయి. మే 2025 చివరి వారం నాటికి 210 యాక్టివ్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు ప్రభుత్వ ఆరోగ్య విభాగం ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
ప్రస్తుత పరిస్థితి.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు
మహారాష్ట్రలో మే 19 నుంచి మే 27 మధ్య కాలంలో 210 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మే 27 నాటికి ఒక్కరోజే 66 కొత్త కేసులు వచ్చాయి. వీటిలో సగం ముంబైలో నమోదయ్యాయి. మిగతా కేసులు పూణే, థానే, నవీ ముంబై, పింప్రి-చించ్వాడ్, నాగ్‌పూర్, సింగ్లి ప్రాంతాల్లో నమోదయ్యాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలో ఐదుగురు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో యువత కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. అయితే ప్రజలు భయాందోళన చెందే అవసరం లేకున్నప్పటికీ. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
వయస్సుతో సంబంధం లేకుండా..
ఈసారి కనిపిస్తున్న వైరస్ వేరియంట్ కొంత మారినట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో పెద్దలే ఎక్కువగా ప్రభావితమవుతుండగా, ఇప్పుడు యువత కూడా ప్రమాదానికి గురవుతున్నారు. థానేలో 21 సంవత్సరాల యువకుడు కోవిడ్‌తో మృతిచెందడం దీనికి ఉదాహరణగా ప్రజలు భావిస్తున్నారు. ఇది వయస్సుతో సంబంధం లేకుండా వైరస్ ప్రభావితం చేస్తుందన్న సంకేతమని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ చర్యలు.. మళ్లీ ఐసోలేషన్ వార్డులు, పరీక్షల ఏర్పాట్లు
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను మళ్లీ ప్రారంభిస్తున్నారు. RT-PCR పరీక్షల సంఖ్యను పెంచుతున్నారు. ప్రజలకు అవసరమైతే ఇంటి వద్దే పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరం పాటించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ కు అడ్డుకట్ట వేస్తున్నాయని చెప్పవచ్చు.
Also Read: Tirumala Alipiri: అలిపిరి మెట్ల మార్గంలో… గడ్డిపోచ కదిలినా ఇక రికార్డే!
ప్రజల అవగాహన.. మళ్లీ మాస్కులు
కొంతకాలంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలలో మాస్కులు ధరించడంపై అలసత్వం వచ్చిందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నందున మాస్కు మళ్లీ ముఖంపైకి రావాల్సిన అవసరం కనిపిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారికే కాదు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు.
కోవిడ్ లక్షణాలు.. ఈసారి ఎలా ఉన్నాయంటే?
ప్రస్తుత వేరియంట్ వల్ల వచ్చిన లక్షణాలు సాధారణంగా జలుబు, దగ్గు, అలసట, తలనొప్పి, చిన్న జ్వరంతో మొదలవుతున్నాయి. కొన్నిసార్లు రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు తక్కువగానే ఉంటున్నాయి. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
ఏం చేయాలి?
జలుబు, దగ్గు, జ్వరంతో ఉన్నవారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. గుంపుల మధ్యకు వెళ్లడం తక్కువ చేయాలి. చేతుల పరిశుభ్రత పాటించాలి. మళ్లీ బూస్టర్ డోస్ అవసరమైతే తీసుకోవాలి. ఆరోగ్య శాఖ సూచనలు తప్పక పాటించాలి. మహమ్మారి తాత్కాలికంగా తగ్గిపోతుంది కానీ పూర్తిగా పోయిందని అనుకోవడం పొరపాటు. మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న ఈ దశలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.