Tukaram Munde: మంచి చేసిన అధికారులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. సదరు ఆఫీసర్ ఎక్కడ కనిపించినా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది. ఆ రాష్ట్ర ఆహార శాఖ (FDA) కమిషనర్ ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. ప్రజలంతా అతడికి చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. లేచి నిలబడి మరి.. ఆయన అందిస్తున్న విశేష సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఆ ఆఫీసర్ ఎవరు? ఆయన ఏం చేశారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
మహారాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో ఒకరైన తుకారాం ముండే.. ఆహార శాఖ కమిషనర్ గా తనదైన ముద్ర వేస్తున్నారు. ముంబయి నగరంలో శుచి-శుభ్రత, నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై ఉక్కుపాదం మెుపుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న దాదాపు 100 రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్‌ల లైసెన్సులను ఆయన నిలిపివేశారు. ఈ కఠిన చర్యలకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే పూణేలోని ‘బాల్ గంధర్వ రంగా మందిర్’లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పాల్గొనగా.. అక్కడి వారంతా లేచి నిలబడి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
Mr Tukaram Mundhe receiving a celebrity-like welcome from people may look inspiring, but it also reflects a sad reality of Indian bureaucracy.
He is being cheered for simply doing what a civil servant is supposed to do working honestly, fearlessly and without bending to… pic.twitter.com/aTOcnbNDAh
— Grey Insights (@GI_Bharat) August 9, 2026
నీతి – నిజాయితీ, విధి నిర్వహణలో కఠినమైన నిర్ణయాలకు తుకారాం ముండే పేరుగాంచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సాధారణ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల మధ్య జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుంటూనే.. పొలం పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేసేవారు. అనంతరం ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యను పూర్తి చేశారు. 2004లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించి.. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
గత రెండు దశాబ్దాల్లో ఆయన అసిస్టెంట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వంటి అనేక కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. నాందేడ్, వాషిమ్, జాల్నా, సోలాపూర్, నవీ ముంబై, నాసిక్, నాగ్‌పూర్, పూణే వంటి ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. అయితే పనిచేసిన ప్రతిచోటా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా సోలాపూర్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో నీటి సంరక్షణ, పరిపాలనా సంస్కరణల్లో ఆయన చూపిన చొరవకు గాను 2015-16 సంవత్సరానికి ‘ఉత్తమ జిల్లా కలెక్టర్’ అవార్డును అందుకున్నారు. ప్రజలు ఆయనను ఆప్యాయంగా ‘మహారాష్ట్ర వాటర్ మ్యాన్’ అని పిలుచుకుంటారు.
Also Read: ప్రకాష్ రాజ్‌కు 4 ఓట్లు? ఇప్పుడు ఒక్క ఓటు కూడా లేదా? అసలు.. SIR ఫారం ఇచ్చారా?
తుకారాం ముండే కెరీర్‌లో అత్యంత చర్చనీయాంశమైన అంశం ఆయన బదిలీలు. దాదాపు 20 ఏళ్ల సర్వీసులో ఆయన దాదాపు 25 సార్లు బదిలీ అయ్యారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనలకు కట్టుబడి పనిచేయడం, అక్రమాలపై కఠినంగా వ్యవహరించడమే ఆయన తరచుగా బదిలీ కావడానికి కారణంగా చెబుతుంటారు. ప్రస్తుతం ఎఫ్‌డీఏ కమిషనర్‌గా ఆహార పరిశ్రమలో జవాబుదారీతనం, పారిశుధ్యం పెంచడానికి ఆయన తీసుకుంటున్న చర్యలపై సామాజిక మాధ్యమాల్లో సైతం తీవ్రస్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: వింత బాలుడు.. ఐదేళ్లుగా చెరువు నీటిలో జీవనం.. చూసేందుకు ఎగబడుతున్న జనం!