Hyderabad Voter: స్వేచ్ఛ బ్యూరో: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ గడువు సోమవారం రాత్రి పన్నెండు గంటలకు ముగిసింద. జూన్ 25వ తేదీ నుంచి కొనసాగుతున్న ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు కేంద్ర ఎన్నికల సంఘం రెండు సార్లు 16 రోజుల పాటు గడువు పెంచినా, రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ జిల్లాలో ముందుగా ఊహించిన విధంగా సర్ ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణం కేవలం 58.77 శాతం మాత్రమే జరిగింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్..
ఈ సర్ ప్రక్రియతో రాష్ట్రంలోని వివిధ జిల్లా నుంచి విద్యా, ఉద్యోగం, వ్యాపారాల నిమిత్తంతో పాటు ఇతర అవసరాలకు నగరానికి వచ్చిన వారికి రీపీటెడ్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల సంఖ్యే దాదాపు 40 శాతం ఉన్నట్లు అధికారులు విడుదల చేసిన లెక్కలతో తేలిపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియకు చివరి రోజైన 10వ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల కల్లా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విడుదల చేసిన లెక్కల ప్రకారం సిటీలో సర్ ప్రక్రియ 58.77 శాతం వరకు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4 వేల 62 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 47 లక్షల 36 వేల 669 మంది ఉండగా, ఈ ఓటర్లందరికీ నూటికి నూరు శాతం ఎన్యుమరేషన్ ఫారాలను జారీ చేసిన ఎన్నికల విభాగం అధికారులు వాటిని 2002 సర్ వివరాలతో పూరించి సమర్పించాలని సూచించగా, ఫారాలు తీసుకున్న వారిలో సుమారు 26 లక్షల నుంచి 27 లక్షల మంది తమ 2002 సర్ వివరాలతో తిరిగి సమర్పించినట్లు అధికారులిచ్చిన లెక్కలు చెబుతున్నాయి.
అధికారులు విడుదల చేసిన లెక్కలు..
ఇక ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల సంఖ్య సర్ ప్రక్రియ చివరి తేదీ కల్లా సుమారు 19 లక్షల 47 వేల 598 మంది ఉన్నట్లు ఇప్పటి వరకు జరిగిన సర్ ప్రక్రియతో తేలిపోయింది. దాదాపు ఈ ఓట్లన్నీ తొలగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం ఓటర్లు 47 లక్షల 36 వేల 669 మంది కాగా, వీటిలో ఏఎస్ డీ ఓటర్ల సంఖ్య 19 లక్షల 47 వేల 598 మంది ఓటర్లను తొలగిస్తే హైదరాబాద్ జిల్లా ఓటర్ల సంఖ్య 27 లక్షల 89 వేల 71 మందికి పరిమితం కానున్నట్లు అధికారులు సోమవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం అధికారులు అంఛనాలేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరించిన తర్వాత అక్టోబర్ 12వ తేదీన తుది జాబితాను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 47 లక్షల పై చిలుకు ఉన్న ఓటర్ల సంఖ్య సుమారు 27 లక్షల నుంచి 28 లక్షల మధ్య వరకు పడిపోనున్నట్లు సమాచారం.
స్వస్థలంలోని ఓటుపైనే మొగ్గు..
వివిధరకాలుగా హైదరాబాద్ లో స్థిరపడిన సెటిలర్లు హైదరాబాద్ లోన ఓటు కన్నా తమ స్వస్థలాల్లోనున్న ఓట్ల పైనే ఎక్కువగా మొగ్గు చూపినట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ ఓటరుగా నమోదైన ఓటర్లు ప్రతి అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ లో తమ స్వస్థలంలోని ఓటు హక్కునే సద్వినియోగం చేసుకుంటున్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో నమోదైన ఓటింగ్ శాతంతో అధికారులు లెక్కలు తేల్చారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ సిటీలోని ఒకటి, రెండు చోట్ల కూడా ఓటర్లుగా నమోదైన వారు ఆ ఓటుకు కాకుండా తమ స్వస్థలంలోని ఓటుకు సర్ 2002 సమాచారాన్ని జోడించి ఫారాలను సమర్పించటంతో సిటీలో అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల సంఖ్య దాదాపు 19 లక్షల 47 వేల 598గా నమోదైంది.
Also Read: నగర రోడ్లపై రోజుకు 1200 మందికి పైగా మందుబాబులు.. అసలు చట్టం అంటే భయం పోవడానికి కారణమేంటి?
చివరి రోజు అందుబాటులో లేని బీఎల్ఓలు..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) ప్రక్రియకు సోమవారం చవరి రోజు, బోనాల సెలవు రోజు అయినప్పటికీ, జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమించినా 4 వేల 62 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు రాత్రి పన్నెండు గంటల వరకు ఓటర్లకు అందుబాటులో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించినట్లు తెల్సింది. జూన్ 25వ తేదీ నుంచి కొనసాగుతున్న ఈ రివిజన్ లో భాగంగా ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారు ఎట్టి పరిస్థితుల్లో సోమవారం రాత్రి వరకు సమర్పించాలని, ఫారాలు సమర్పించని వారి వివరాలు ఈ నెల 17వ తేదీన జారీ చేయనున్న ఓటరు జాబితా ముసాయిదాలో ఉండవని కూడా ఆయన సూచించారు. హైదరాబాద్ జిల్లాలో సికిందరాబాద్ ప్రాంతం మినహా మిగిలిన మెజార్టీ ప్రాంతాల్లో ఆదివారం బోనాలు, సోమవారం రంగం వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా వేడుకల్లో మునిగి తేలుతున్న పాతబస్తీ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో కొందరు సోమవారం ఫారాలు సమర్పించేందుకు ప్రయత్నాలు చేసినా బూత్ లెవెల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోయే సరికి కొందరు ఈ సేవా, మీ సేవాల్లో ఆన్ లైన్ లో సర్ చేసుకోగా, మర కొందరు ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్ల ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్లకు పంపినట్లు తెలిసింది.
నియోజకవర్గం- మొత్తం ఓటర్లు- డిజిటైజ్డ్ అయిన ఓటర్లు- ఏఎస్ డీ (ASD) ఓటర్లు- సర్వే శాతం (%)
జూబ్లీహిల్స్= 4,06,729 2,25,886 1,80,843 55.54%
సనత్ నగర్= 2,54,030 1,38,023 1,16,007 54.33%
కార్వాన్= 3,83,190 2,40,747 1,42,443 62.83%
గోషామహాల్= 2,75,208 1,64,032 1,11,176 59.60%
సికిందరాబాద్= 2,68,951 1,64,697 1,04,254 61.24%
నాంపల్లి= 3,45,940 2,07,705 1,38,202 39.95%
చాంద్రాయణగుట్ట= 3,77,300 2,26,930 1,50,285 60.15%
యాకుత్ పురా= 3,74,948 2,18,707 1,52,760 58.33%
మలక్ పేట= 3,30,191 1,81,522 1,44,753 54.97%
అంబర్ పేట= 2,82,314 1,61,201 1,17,081 57.10%
బహద్దూర్ పురా= 3,51,023 2,28,601 1,14,417 65.12%
ముషీరాబాద్= 3,10,116 1,68,584 1,41,205 54.36%
ఖైరతాబాద్= 2,93,667 1,68,678 1,24,398 57.44%
కంటోన్మెంట్= 2,45,529 1,39,833 1,05,008 56.94%
చార్మినార్= 2,37,483 1,41,465 94,866 59.57%
= మొత్తం (Total)- 47,36,669 27,76,624 19,47,598 58.77%