Captive Power Plants: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. రాబోయే రోజుల్లో కరెంట్ కొరత వంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి, దేశంలో అందుబాటులో ఉన్న ప్రతీ విద్యుత్ యూనిట్‌ను వీలైనంత సమర్థవంతంగా వాడుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
క్యాప్టివ్ ప్లాంట్లకు స్పష్టమైన మార్గదర్శకాలు
ఈ నూతన ఆదేశాల ప్రకారం.. 50 మెగావాట్లు అంతకంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న బొగ్గు ఆధారిత క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు తమ పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ప్లాంట్లు తమ సొంత పరిశ్రమల వినియోగానికి పోను మిగిలిన అదనపు విద్యుత్‌ను పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని కేంద్రం స్పష్టం చేసింది.
బొగ్గు నిల్వలు, పర్యవేక్షణ సులభం
విద్యుత్ ఉత్పత్తికి ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రతీ ప్లాంట్ తమ వద్ద తగినంత బొగ్గు నిల్వలను ముందే సిద్ధం చేసుకోవాలని సూచించింది. వీటితో పాటు, తమ ప్లాంట్‌లో జరుగుతున్న ఉత్పత్తి, సొంత వాడకం, మార్కెట్‌లో అమ్మకాలు, మిగిలి ఉన్న సామర్థ్యం, బొగ్గు నిల్వల వివరాలను ప్రతి వారం కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థకి నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.
అమలు కాలపరిమితి
ఈ కీలక నిబంధనలు ‘2026 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు’ అమల్లో ఉంటాయి. గ్రిడ్‌లో ఎప్పుడూ తగినంత విద్యుత్ లభ్యత ఉండేలా చూసి, సాధారణ వినియోగదారులకు , పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం.
Also Read: ఆర్మీ ఆయుధాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్.. ఎలా దొంగతనం చేశాడంటే..