ప్రజల మధ్య కల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ముంబై పోలీసు కమిషనర్ లకు శివసేన లేఖ రాసింది. ఇటీవల షోలాపూర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో వీరు ఇచ్చిన ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించింది.
ఈ మేరకు శివసేన సోషల్ మీడియా ఇంఛార్జ్ రహూల్ కనాల్ పోల్ ప్యానెల్ రాసిన లేఖలో ఓవైసీ సోదరులు తమ ప్రసంగాల ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఓవైసీ సోదరుల ప్రసంగంలో ప్రజాశాంతికి భంగం కలిగించే ప్రకటనలు ఉన్నాయని తెలిపారు. మతం ప్రాతిపదికన శత్రుత్వం, మతాల మధ్య విభజను సృష్టించడం లాంటివి ఉన్నాయని పేర్కొన్నారు.
మత సామరస్యానికి విఘాతం కలిగించడం, సమాజంలో అశాంతి సృష్టించడం లక్ష్యంగా ఓవైసీ సోదరుల ప్రసంగం ఉందని, వారి ప్రసంగంలో నేరపూరిత కంటెంట్ స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. వారి ఉద్వేగభరితమైన ప్రసంగాల వల్ల ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పు ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఓవైసీ సోదరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఓవైసీ బ్రదర్స్ ప్రసంగం వీడియో ఆధారంగా సమగ్ర విచారణ జరిపి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయని అధికారులకు తెలిపారు.