Man Dies Saving Kitten| మూగజీవాల పట్ల అతని ప్రేమ వల్లే అతని ప్రాణాలు తీసింది. ఒక మూగజీవం ప్రమాదంలో ఉందని గ్రహించిన ఒక యువకుడు దాన్ని కాపాడడానికి పరుగులు తీశాడు. ఆ క్రమంలో అతడిని మృత్యువు కబళించింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఒల్లుక్కురా ప్రాంతానిక చెందిన యువకుడు సీజో టిమోతీ (40). రెండు రోజుల క్రితం రోజూలాగే తన బైక్ పై ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గంలో మన్నుత్తి కలాతోడు జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో సిగ్నల్ వద్ద బైక్ ఆపి వేచి చూస్తున్న సీజోకి అనుకోకుండా ఒక మూగజీవి కనిపించింది.
ఒక పిల్లి తన పిల్లతో కలిసి రోడ్డు దాటుతోంది. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ అయింది. దీంతో అటువైపు నుంచి వాహనాలు వేగంగా వస్తున్నాయి. పిల్లి వెంటనే వాహనాల రాకను గమనించి తప్పించుకుంది. కానీ దాని పిల్లకు గాయాలయ్యాయి. అది చూసిన సీజో వెంటనే బైక్ మీద నుంచి దిగి దాన్ని కాపాడడానికి వెళ్లాడు. రోడ్డు అవతలి వైపు దాని తల్లి వద్దకు చేరుద్దామనేది సీజో ఉద్దేశం. సీజో వెళ్లే లోపు ఆ బుల్లి పిల్లి వైపు ఓ ట్రక్కు దూసకొచ్చింది. అయితే దాని కింద పడకుండా సీజో హీరోలాగా దాన్ని కాపాడేందుకు పరుగులు తీశాడు. పిల్లిని కాపాడాడు కానీ ఆ ట్రక్కు.. సీజోని బలంగా ఢీకొట్టింది. దీంతో సీజో గాల్లో ఎగిరి పక్కకు పడ్డాడు. కానీ అక్కడ స్పీడుగా వస్తున్న మరో కారు సీజోని ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటన మొత్తం సీసీటీవిలో రికార్డ్ అయింది.
Also Read: వారంలో కూతురి పెళ్లి.. ఈలోగా అత్త లేచిపోయింది
వరంగల్ లో జరిగిన ఇలాంటి ఘటన
తెలంగాణలో వారం రోజుల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. వరంగల్ జిల్లా నెక్కొండ పట్టణంలో ఒక బావిలో పడిన పిల్లిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ పట్టణానికి చెందిన కక్కెర్ల యాదగిరి (59), ఒక గీత కార్మికుడు.
అదే గ్రామంలో నివసించే తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్లాడు యాదగిరి. అక్కడ సమీపంలోని ఒక బావిలో ఒక పిల్లి పడిపోయిందని అతనికి స్థానికులు తెలిపారు. ఈ దృశ్యం చూసిన యాదగిరి ఆ పిల్లిని బయటకు తీయడానికి తన నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగే ప్రయత్నం చేశాడు.
దురదృష్టవశాత్తు ఈ ప్రక్రియలో తాడు జారిపోయి, యాదగిరి బావి నీటిలో పడిపోయాడు. స్థానికులు అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ, బయటకు తీసేసరికి అతను ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన యాదగిరి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.