Devara Trailer Review: కులం లేదు.. మతం లేదు .. భయం అస్సలు లేదు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ తో దేవర ట్రైలర్ మొదలయ్యింది. ట్రైలర్ ను బట్టి ఒక అంచనాకు రావడం కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు.. కానీ, ఒక ట్రైలర్ చూసి సినిమాలో కొంతవరకు ఏం జరుగుతుందో అర్ధం చేసుకొనే స్టామినా సినిమా ప్రేక్షకులకు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం దేవర ట్రైలర్ చూసినవారు కూడా అదే మాట అంటున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా తెరకెక్కిన చిత్రం దేవర. ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం దేవర. ఇక ఈ సినిమాపై అటు ఎన్టీఆర్.. ఇటు కొరటాల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాను చెక్కుతూ వచ్చారు.
నిజం చెప్పాలంటే ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేయొచ్చు. సముద్రపు ఒడ్డున ఒక గ్రామం.. అందులో నివసించే ప్రజలకు సముద్రంలో వచ్చే సరుకును దొంగతనం చేసి డబ్బును కూడబెట్టుకోవడమే పని. వారికి ఎదురు తిరిగినవారిని చంపేయడం మాత్రమే తెలుసు. ఇక అదే గ్రామానికి దేవర వస్తాడు. భయం అంటే తెలియని వారికి భయాన్ని పరిచయం చేస్తాడు. ఆ గ్రామానికి లీడర్ గా మారతాడు. దొంగతనం చేయకుండా కష్టపడి బతకమని చెప్తాడు. కానీ అప్పటివరకు దొంగతనాలకు అలవాటు పడ్డ భైరా.. దేవర వలన ఆ గ్రామంలో తన విలువను కోల్పోతాడు.
దేవరతో ఫ్రెండ్ షిప్ చేస్తూనే.. అతడిని అడ్డు తొలగించుకోవాలని చూస్తాడు. అలా ఒకరోజు సముద్రంలోకి వెళ్లిన దేవర మళ్లీ తిరిగి రాడు. ఇక ఏళ్లు గడిచేకొద్దీ మళ్ళీ గ్రామంలో భైరా అక్రమాలు మొదలవుతాయి. దేవర కొడుకే వర. చాలా భయస్తుడు. తండ్రి పోలికలతో పుట్టినా.. అన్యాయాన్ని ఎదిరించలేని భయస్తుడు. అలాంటి వరాకు ఒకరోజు ఎదురించాల్సిన పరిస్థితి వస్తుంది.
మరి చివరకు వర.. తండ్రి దేవరలా మారాడా.. ? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు.. ? భైరా చేసిన కుట్ర ఏంటి.. ? సముద్రంలో దొంగతనానికి వెళ్లిన వారిని అడ్డుకుంటుంది ఎవరు.. దేవరనా.. ? వరానా.. ? అనేది మిగిలిన కథ. ఒకరకంగా చెప్పాలంటే ఇదేం కొత్త కాదు. సేమ్ ఆచార్యలానే అనిపిస్తుంది. అందులో రామ్ చరణ్, సోనూసూద్ మధ్య జరిగే కథ.. ఇందులో ఎన్టీఆర్- సైఫ్ ఆలీ ఖాన్ మధ్య జరుగుతుంది. అక్కడ పాదఘట్టం ప్లాట్ అయితే .. ఇక్కడ భయం అనేది ప్లాట్ అని చెప్పాలి.
భయమే లేని వ్యక్తులకు భయం పుట్టేలా చేసి భయంతో బతుకుతున్న గ్రామస్తులకు ధైర్యంగా నిలబడినవాడే దేవర. ఆచార్యలో చరణ్ ఆశయాన్ని కాపాడడానికి చిరు వస్తే.. ఇక్కడ తండ్రి ఎన్టీఆర్ ఆశయాన్ని కాపాడడానికి కొడుకు ఎన్టీఆర్ వస్తాడు. అక్కడ పూజా హెగ్డే.. ఇక్కడ జాన్వీ కపూర్. అచ్చు గుద్దినట్లు ఆచార్యను దింపేశాడు కొరటాల.
ఇక ట్రైలర్ కట్ అంతా బానే ఉంది. కొరటాల టేకింగ్, విజువల్స్ అంతా ఒక ఎత్తు అయితే.. అనిరుధ్ మ్యూజిక్ మరో ఎత్తు. ట్రైలర్ చూసిన కొంతమంది ఆచార్య, ఆర్ఆర్ఆర్ కలిపి కొట్టినట్లు ఉన్నాడే అని చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ఆచార్య 2 అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ – కొరటాల ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలంటే సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.