Manmohan Singh Personal Life: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేరు ఇక రారు. దేశ ఉన్నతికి పాటుపడ్డ మహానేతగా ప్రపంచ స్థాయి పేరుగాంచిన మన్మోహన్ ఆదర్శనీయం, అనుసరణీయం. 92 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మన్మోహన్ సింగ్, తన వ్యక్తగత జీవితం ద్వారా కూడా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక వేత్తగా తెలిసిన మన్మోహన్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి, ప్రధానిగా పదేళ్లు పాలన సాగించారు. పాలనలోనూ తనదైన మార్క్ చూపించి, భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మన్మోహన్ కృషి చేశారు.
మన్మోహన్ రాజకీయ జీవితమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 1932 సెప్టెంబరు 26న పంజాబ్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో గల చక్వాల్ లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు. ఈయన బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. చదువంటే ప్రాణం గల మన్మోహన్ నిరంతరం పుస్తకం చేతిలో పట్టుకొని పఠించేవారు. తల్లిని కోల్పోయిన మన్మోహన్ ను అమ్మమ్మ చేరదీసి పోషించారు. నాడు ఆమె చేరదీసి చెప్పిన మాటలే, మన్మోహన్ ను మంచి ఆర్థికవేత్తగా ప్రపంచానికి పరిచయం చేసిందట.
ఇక మన్మోహన్ వైవాహిక జీవితంలోకి వెళ్తే.. మన్మోహన్ వివాహం 1958 లో జరిగింది. ప్రొఫెసర్, రచయిత గురుశరణ్ కౌర్ కోహ్లీని మన్మోహన్ వివాహం చేసుకున్నారు. ఒకరేమో ఆర్థికవేత్త, మరొకరు ప్రొఫెసర్ గా ఎవరి రంగంలో వారు రాణించారు. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం. ఉపీందర్ , దమన్ , అమృత్ లు కాగా, వీరు కూడా ఉన్నత విద్యను కొనసాగించి రచయితలుగా కూడా పలు పుస్తకాలు రాశారు. ఉపిందర్ కౌర్ ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె ప్రాచీన ఢిల్లీ, ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మిడిల్ ఇండియా సహా ఆరు పుస్తకాలు రాశారు. దమన్ కౌర్ కూడా నవల రచయిత్రిగా పేరు గాంచారు. మూడవ కుమార్తె అమృత్ కూడా, ఏసీఎల్యూలో స్టాఫ్ అటార్నీగా పనిచేస్తున్నారు.
Also Read: Manmohan Singh: ఔను.. మన్మోహన్ సింగ్ ప్రేమలో పడ్డారు.. మీకు తెలుసా!
ఇక మన్మోహన్ కుమార్తెలు ముగ్గురు మతాంతర వివాహలు జరుపుకున్నారు. వీరి వివాహాలకు మన్మోహన్ దంపతులు ఎటువంటి అడ్డు చెప్పకుండా, సమ్మతించారట. మన్మోహన్ సాధించిన విజయాలకు కొదువలేదు. అలాగే తన వ్యక్తిగత జీవితంలోనూ ఆయన, సక్సెస్ సాధించారు. ముగ్గురు కుమార్తెలు జన్మించినా, వారిని ఉన్నత విద్యవైపు సాగించారు. అలాగే మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్ కోహ్లీ కూడా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడేవారట. మన్మోహన్ ఆశయాలకు అనుగుణంగా ఆమె అండదండలుగా మెండుగా ఉన్నాయని, అందుకే మన్మోహన్ సాధించని విజయమంటూ లేదంటారు మన్మోహన్ సన్నిహితులు. ఏదిఏమైనా భరతమాత ముద్దుబిడ్డ మన్మోహన్ ఇక లేరు.. ఇక రారన్న విషయం తెలుసుకున్న యావత్ భారత్ నివాళి అర్పిస్తోంది.